టీడీపీ నేత నారా లోకేష్‌పై కృష్ణలంక పీఎస్‌లో కేసు నమోదైంది. సెక్షన్ 341,186,269 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, ట్రాఫిక్ అంతరాయం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని లోకేష్‌పై కేసులు నమోదయ్యాయి.
గురువారం విమానాశ్రయం ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా లోకేశ్ పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయితే ఆ పార్టీ నేతలు గుంపులుగా అక్కడికి చేరుకుని గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వంపై, పోలీసులపై దూషణలకు దిగడంతో పాటు 144 సెక్షన్‌ను ఉల్లంఘించారు. దీంతో మాజీ ఎమ్మెల్యేలు శ్రీరామ్ తాతయ్య, తంగిరాల సౌమ్య, పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా లోకేశ్‌పై విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ముందస్తుగా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ట్రాఫిక్‌కు అంతరాయం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.