ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబాన్‌కు పొరుగున ఉన్న ఆరు దేశాలు ముఖ్య సూచన చేశాయి. ఇస్లామిక్ స్టేట్, అల్ ఖాయిదాలను పెంచడాన్ని నిరోధించాలని తాలిబాన్‌కు సూచించారు. పాకిస్తాన్‌లో ఆరు దేశాల విదేశాంగ మంత్రులు వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఆ మరుసటిరోజు ఈ మేరకు ఈ ప్రకటనను సంయుక్తంగా జారీ చేశారు. తాలిబాన్లను కలుపుకుని ప్రభుత్వం ఏర్పాటుచేయడం ఉత్తమమని, అలాకాకుండా ఆఫ్ఘనిస్తాన్‌లో దాయిష్, అల్ ఖాయిదా పట్టు సాధించేందుకు అనుమతించవద్దని వారు ఆ సంయుక్త ప్రకటనలో కోరినట్లు టోలో న్యూస్ నివేదించింది. తాలిబాన్ అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఇలా ప్రకటన రావడం ఇదే మొదటిది.
మితవాద విధానాలను అవలంబించాలని తాలిబాన్‌కు ఆరు దేశాలు కోరాయి. అలాగే, ఆఫ్ఘనిస్తాన్ పొరుగు దేశాల పట్ల స్నేహపూర్వక విధానాలను అవలంబించడం, భాగస్వామ్య లక్ష్యాలను సాధించడం, శాంతి, భద్రతలు, దీర్ఘకాలిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పరిపాలించడం అలవర్చుకోవాలని ప్రకటనలో పేర్కొన్నాయి. మహిళలు, పిల్లలతో పాటు ప్రాథమిక మానవ హక్కులను గౌరవించాలని ఆరు దేశాలు ఆఫ్ఘన్‌ను కోరాయి. ఆఫ్ఘనిస్తాన్ గడ్డ మీది నుంచి ఏ ఉగ్ర సంస్థలు కూడా కార్యకలాపాలు నెరపకుండా చూడాలని సూచించాయి. ఈ ఆరు దేశాల సమావేశాలు రొటేషన్ పద్ధతిన నిర్వహస్తున్నామని, తదుపరి సమావేశం టెహరాన్‌లో జరుగుతుందని కూడా ఆ ప్రకటనలో తెలిపాయి.