హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో నెలకొల్పిన సమతా ప్రతిమ (స్టాచూ ఆఫ్ ఈక్వాలిటీ) (Statue of Equality) విగ్రహాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. విగ్రహ ప్రతిష్ఠకు ప్రత్యేక ఆహ్వానితులుగా రావాల్సిందిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను శ్రీ తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి ఆహ్వానపత్రం అందజేశారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో శ్రీనివాస రామానుజం, మైహోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్‌రావు, ధనుష్ ఇన్ఫోటెక్ సీఎండీ డీఎస్‌ఎన్ మూర్తి తదితరులు ఉన్నారు.
అదేవిధంగా ఉపరాష్ట్రపతి నివాసంలో వెంకయ్యనాయుడును కలిసిన చినజీయర్ స్వామి.. వెంకయ్య దంపతులను కూడా విగ్రహ ప్రతిష్ఠకు ఆహ్వానించారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసి ఆహ్వానపత్రాలు అందజేయనున్నారు. 200 ఎకరాల స్థలంలో దాదాపు రూ.1000 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముచ్చింతల్‌లో సమతా ప్రతిమ (స్టాచూ ఆఫ్ ఈక్వాలిటీ) ఆవిష్కరణ జరుపనున్నారు. ఈ సందర్భంగా 1035 హోమ గుండాలతో ప్రత్యేక యాగ క్రతువు నిర్వహించనున్నట్లు తెలిసింది.