మరో ఐదు రోజుల్లో జరుగనున్న ఎన్నికల్లో జస్టిన్ ట్రూడో (Justin Trudeau) పార్టీకి విజయావకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇటీవలి సర్వేల్లో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న లిబరల్ పార్టీ వెనుకబడి ఉన్నది. కరోనాతోపాటు అనేక అంశాలపై ప్రజలు ట్రూడోపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన విజయం అసాధ్యమని సర్వేలు అంటున్నాయి. మధ్యంతర ఎన్నికల నిర్ణయంపై సొంత పార్టీ నుంచే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో జస్టిన్ ట్రూడో (లిబరల్), ఎరిన్ ఓ టూల్ (కన్జర్వేటివ్), వైవ్స్ ఫ్రాకోయిస్ బ్లాంచెట్ (బ్లాక్ క్యూబికోస్), జగ్మీత్‌సింగ్ (ఎన్‌డీపీ), అన్నామీ పాల్ (గ్రీన్) లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
కెనడాలో ఈనెల 20 న ఎన్నికలు జరుగనున్నాయి. జస్టిన్ ట్రూడే నేతృత్వంలో లిబరల్ పార్టీ మరోసారి అధికారం కోసం పోరాడుతున్నది. ప్రధాని జస్టిన్ ట్రూడో గత నెల 15 న మధ్యంతర ఎన్నికలను ప్రకటించినప్పుడు, కరోనాను విజయవంతంగా నిర్వహించడంతో తమకు సంపూర్ణ మెజారిటీని వస్తుందని భావించారు. ఇప్పుడు ఓటింగ్‌కు వారం ముందు పరిస్థితులు తలకిందులయ్యాయి. ట్యూడో ఆశలు అడియాసలయ్యేలా కనిపిస్తున్నాయి. ట్రూడో ప్రాతినిధ్యం వహించే లిబరల్ పార్టీ ఎన్నికల ప్రచారం బలంగా లేదని, అనేక అంశాల్లో ప్రజలు అతడిపై కోపంగా ఉన్నారని స్థానిక వార్తా పత్రికలు నివేదిస్తున్నాయి.
జస్టిన్ ట్రూడో 2015 నుంచి అధికారంలో ఉన్నారు. 2019 లో రెండోసారి ప్రధాని అయినప్పుడు, ప్రభుత్వం మైనారిటీలో ఉన్నది. ఫలితంగా ముఖ్యమైన బిల్లులను ఆమోదించడానికి లేదా విధాయ నిర్ణయాలు తీసుకోవడానికి వారు ప్రతిపక్ష పార్టీల సహాయం తీసుకోవాల్సి వచ్చింది. కరోనాను నిలువరించడంలో టీకా డోసులు అందించే కార్యక్రమం విజయవంతం అయినప్పటికీ, అతని ప్రభుత్వం పట్ల సామాన్య ప్రజలలో కొంత కోపం కనిపిస్తున్నదని నిపుణులు అంటున్నారు. 49 ఏళ్ల ట్రూడోకు సంపూర్ణ మెజారిటీ కోసం 38 శాతం ఓట్లు అవసరం కాగా, ఇప్పుడు ఈ సంఖ్య సాధించడం ఆయనకు చాలా కష్టంగా ఉన్నదని వారంటున్నారు. అలాగే, మధ్యంతర ఎన్నికలకు వెళ్లడంపై కూడా ఆయన సొంత పార్టీలోనే చాలా మంది విముఖత చూపారు. ప్రస్తుతం కన్జర్వేటీవ్ పార్టీ ముందంజలో ఉన్నట్లు సర్వేలు చెప్తున్నాయి.