అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను (Kamala Harris) చంపేందుకు కుట్రపన్నినట్లు ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళ ఒప్పుకున్నది. నేరాన్ని అంగీకరించడంతో ఆ మయామి నర్స్‌కు ఫెడరల్ కోర్టు ఐదేండ్ల జైలుశిక్ష విధించింది. 39 ఏళ్ల నివియాన్ పెటిట్ ఫెల్ప్స్ శుక్రవారం వైస్ ప్రెసిడెంట్ బెదిరింపుల నేరారోపణలను అంగీకరించారు. కమలా హారిస్‌ను హత్య చేస్తానని ఆరుసార్లు బెదిరింపులకు పాల్పడినట్లు తానే స్వయంగా కోర్టుకు వెల్లడించింది. ఫ్లోరిడాలోని జిల్లా కోర్టులో పిటిషన్ విచారణ సందర్భంగా ఫెల్ప్స్ తనపై ఆరోపించిన నేరాలన్నింటినీ ఒప్పుకున్నారు. కమలా హారిస్ నల్ల జాతికి చెందిన వ్యక్తి కాకపోవడం వల్లనే ఆమెను చంపేందుకు బెదిరించినట్లు ఫెల్ప్స్ విచారణ అధికారుల ఎదుట చెప్పినట్లు తెలుస్తున్నది.
కమలా హారిస్‌ను చంపుతానంటూ తనంత తానుగా తీసుకున్న 30 సెకండ్ల నిడివి గల వీడియో క్లిప్పులను జైలులో ఉన్న తన భర్తకు పంపినట్లు న్యాయస్థానం గుర్తించింది. కమలపై దాడి చేయాలన్న ఆలోచన మేరకు కొందరు వ్యక్తులతో బేరం కుదుర్చుకున్నానని, 50 రోజుల్లోనే ఆమెను చంపేస్తారని ఆ వీడియో క్లిప్పుల్లో రికార్డయి ఉన్నది. హారిస్‌ను చంపేందుకు 53 వేల డాలర్లకు కొందరితో ఒప్పందం చేసుకున్నట్లు చెప్తున్న వాయిస్ కూడా వినిపిస్తున్నది. ఈ వీడియో క్లిప్పుల్లో కొన్నింటిని తనకు తాను రికార్డ్ చేయగా.. మరికొన్నింటిని ఆమె పిల్లలు రికార్డ్ చేసినట్లుగా తెలుస్తున్నది. ఈ వీడియోలను పంపిన తర్వాత, తుపాకీ రేంజ్‌లో టార్గెట్ షీట్ వద్ద తుపాకీ పట్టుకున్న ఫొటోను కూడా పంపింది. దాచిపెట్టిన ఆయుధానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు కూడా ప్రాసిక్యూటర్లు కోర్టుకు విన్నవించారు.