తెలంగాణ

చట్టసభల గౌరవం కాపాడాలి : స్పీకర్‌ పోచారం

దేశస్థాయిలో పార్లమెంట్‌, రాష్ట్రస్థాయిలో లెజిస్లేచర్‌ అత్యంత ఉన్నతమైన సభలని, వీటి గౌరవం కాపాడాల్సిన బాధ్యత సభ్యులతో పాటు ప్రతి ఒక్కరిపై ఉందని తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం 81వ ఆల్‌ ఇండియా అసెంబ్లీ స్పీకర్లు, కౌన్సిల్‌ చైర్మన్ల కాన్ఫరెన్స్‌ వర్చువల్‌ విధానంలో జరిగింది. హైదరాబాద్‌లోని అసెంబ్లీ భవనంలో వీడియోకాన్ఫరెన్స్‌ రూమ్‌ నుంచి స్పీకర్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆల్‌ ఇండియా ప్రిసైడింగ్‌ ఆఫీసర్స్‌ కాన్ఫరెన్స్‌ సమావేశం తొలిసారిగా 1921, సెప్టెంబర్‌ 15న జరిగింది. నేటికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా.. పోచారం శుభాకాంక్షలు తెలిపారు.

సమావేశంలో పాల్గొన్న 21 రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ స్పీకర్లు, ఆరు రాష్ట్రాల శాసనమండలి చైర్మన్లతో పాటు కామన్వెల్త్‌ దేశాల స్పీకర్లు పాల్గొన్న సమావేశంలో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ డెప్యూటీ చైర్మన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘సంసద్‌ టీవీ’ ప్రసారాలను ప్రారంభినందుకు అభినందలు చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రాల అసెంబ్లీ, కౌన్సిల్‌ సమావేశాలనూ సంసద్‌ టీవీ ద్వారా ప్రసారం చేయాలని పోచారం విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో చట్టసభల్లో జరుగుతున్న అసంబద్ద చర్యలను సరి చేయాలని విజ్ఞప్తి చేశారు. అవనసరమైన బయటి రాజకీయాలను సభ్యులు సభల్లో ప్రస్తావించొద్దని కోరారు. కేవలం ప్రజా సమస్యలపై మాత్రమే మాట్లాడేలా అనుమతి ఇవ్వాలని, అనుమతి ఇచ్చిన సబ్జెక్ట్‌పైనే సభ్యుడు మాట్లాడాలని.. మరో విషయంపై మాట్లాడకుండా సభ్యులను నియంత్రించాలన్నారు. బిల్లులపై సభ్యులకు ముందుగానే పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని, తద్వారా సభ్యుల అభిప్రాయాలు, ఆలోచనలను పూర్తిగా పంచుకోగలుగుతారన్నారు.

ఇటీవల కాలంలో చట్టసభల్లో అల్లర్లు జరుగడం.. వాయిదాలు వేయడం పరిపాటిగా మారిందని.. ఇవి జరుగకూడదన్నారు. పాఠశాల విద్యార్థుల్లా చట్టసభల్లో సభ్యులు అల్లరి చేయడం దురదృష్టకరమన్నారు. చట్టసభల పవిత్రతను, అత్యున్నత గౌరవాన్ని కాపాడడానికి సరైన విధాలను రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండలి పొట్రెం స్పీకర్‌ భూపాల్‌రెడ్డి, లెజిస్లేటివ్‌ సెక్రెటరీ డాక్టర్‌ వీ నరసింహాచార్యులు పాల్గొన్నారు.