తెలంగాణ ముఖ్యాంశాలు

Malabar Group : తెలంగాణలో మలబార్‌ గ్రూప్‌ భారీ పెట్టుబడి

తెలంగాణ రాష్ట్రంలో మలబార్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ భారీ పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. ‘మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌’ బంగారం, వజ్రాల ఆభరణాల తయారీ యూనిట్‌తోపాటు శుద్ధి కర్మాగారాన్ని రాష్ట్రంలో నెలకొల్పనున్నది. యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు రూ.750 కోట్ల అంచనాతో సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ పెట్టుబడితో రాష్ట్రంలో 2,500 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. మలబార్‌ గ్రూప్‌ ఆఫ్‌ చైర్మన్‌ ఎంపీ అహ్మద్‌తో పాటు సంస్థ ప్రతినిధి బృందం మంత్రి కేటీఆర్‌ను బుధవారం హైదరాబాద్‌లో కలిశారు. రాష్ట్రంలో పెట్టబోయే పెట్టుబడి విషయాన్ని మంత్రితో సమావేశమైన సందర్భంగా వెల్లడించారు.

అనంతరం సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి కారణం ఇక్కడ నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్నట్లు గుర్తించామన్నారు. అంతేకాకుండా స్నేహపూర్వక వాతావరణంతో పాటు ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు ప్రోత్సహించే విధంగా ఉన్నాయని కితాబిచ్చారు. అందుకే తాము రాష్ట్రంలో యూనిట్‌ను నెలకొల్పడానికి ముందుకు వచ్చినట్లు వెల్లడించారు. మలబార్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 260 ఆభరణాల దుకాణాలు కలిగి ఉందని పేర్కొన్నారు.

మలబార్‌ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడాన్ని మంత్రి కేటీఆర్‌ స్వాగతించారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల సహాయ సాకారాలు అందజేస్తుందని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా 2,500 మంది స్వర్ణకారులకు తెలంగాణ ప్రాంతంలో ఉపాధి లభించనుండటంతో మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఆయా జిల్లాల్లో ఆభరణాల తయారీలో ఎంతో మెళకువలు కలిగిన వారు ఉన్నట్లు చెప్పారు. అటువంటి వారికి కంపెనీ ప్రతినిధులు ఉపాధి అవకాశాలను కల్పించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేశ్‌రంజన్‌తో పాటు పరిశ్రమల శాఖకు చెందిన సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.