ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 25న ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో జనరల్ డిబేట్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సెప్టెంబర్ 24-25 తేదీల్లో అధ్యక్షుడు జో బైడెన్‌తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. 24న ప్రధాని మోదీ వాషింగ్టన్‌లో క్వాడ్ నేతల సదస్సుకు హాజరవుతారని తెలిపింది.
ప్రధాని మోదీ వైట్‌హౌస్‌లో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యషిహిడె సుగతో భేటీ అవుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు. కాగా గతంలో క్వాడ్ సదస్సు దేశంలో సెకండ్ వేవ్ తలెత్తిన సమయంలో మార్చి 12న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఆప్ఘనిస్ధాన్‌లో తాలిబన్లు కొలువుతీరడంతో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో మోదీ అమెరికా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఆప్ఘన్‌లో తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించే విషయంలో ప్రపంచ దేశాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాలిబన్లను గుర్తించే విషయంలో చైనా సానుకూల సంకేతాలు పంపుతుండగా, ఆప్ఘన్‌లో తాలిబన్ సర్కార్‌ను గుర్తించవద్దని అమెరికాపై విపక్షాలు ఒత్తిడి తీసుకువస్తున్నాయి. మరోవైపు ఈ వ్యవహారంపై భారత్ వ్యూహాత్మక మౌనం కొనసాగిస్తోంది.