- యూఎస్, ఆస్ట్రేలియా, బ్రిటన్
- దేశాలు ‘ఆకస్’ పేరుతో జట్టు
- క్వాడ్‌కు అదనంగా కొత్త కూటమి
- ఇండో పసిఫిక్‌లో స్థిరత్వానికే
- మూడు దేశాల ఉమ్మడి ప్రకటన
ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాకు ముకుతాడు వేసేందుకు క్వాడ్‌కు అదనంగా మరో కూటమి ఏర్పాటైంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలు కలిసి ‘ఆకస్(ఏయూకేయూఎస్)’ పేరుతో భద్రతా కూటమిగా ఏర్పడ్డాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం కోసం ఈ మూడు దేశాలు తమ రక్షణ సామర్థ్యాలతో పాటు కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ వనరులను పరస్పరం పంచుకోనున్నాయి. అణుశక్తితో నడిచే జలాంతర్గాముల తయారీలో ఆస్ట్రేలియాకు అమెరికా, బ్రిటన్‌లు సాయం చేయనున్నాయి. ‘ఇండో పసిఫిక్ ప్రాంతంలో 21వ శతాబ్దంలో కొత్తగా ఎదురవుతున్న ముప్పులను ఎదుర్కొని, స్థిరత్వం తీసుకురావడమే లక్ష్యంగా ఈ కూటమి ఏర్పడింది’ అని అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. అయితే ఎక్కడా చైనా పేరును ప్రస్తావించలేదు. వర్చువల్ విధానంలో ఈ కూటమిని ప్రారంభించారు. ‘ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం అవశ్యం. ఈ ఉమ్మడి లక్ష్యం విషయంలో మా మూడు దేశాలు ఇప్పటికే సహకరించుకొంటున్నాయి. దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకే కూటమిగా ఏర్పడ్డాం. ఇది చరిత్రాత్మక నిర్ణయం’ అని బైడెన్ అన్నారు. ఆకస్ కార్యాచరణను 18 నెలల్లో రూపొందించనున్నారు. ఇండో పసిఫిక్‌లో చైనాకు చెక్ పెట్టేందుకే గతంలో క్వాడ్ భద్రతా కూటమి ఏర్పడింది. ఇందులో భారత్ కూడా భాగస్వామి. క్వాడ్ సమావేశం ఈ నెల 24న జరుగనున్నది. సమావేశానికి వారం రోజుల ముందు అదే లక్ష్యంతో కొత్త కూటమిని ప్రకటించడం విశేషం.
ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు: చైనా
కొత్త కూటమి ఆకస్‌ను చైనా ఖండించింది. ఇది ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని విమర్శించింది. ‘ఆస్ట్రేలియా అణ్వాయుధ దేశం కాదు. ఇప్పుడు అణు జలాంతర్గామి తయారు చేయడానికి సిద్ధపడుతున్నది. ఇది అణు నిరాయుధీకరణ లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది’ అని చైనా విదేశాంగ శాఖ ఆరోపించింది. ఆయుధాల కొనుగోళ్లు పెరుగుతాయని పేర్కొన్నది. ఇండో పసిఫిక్‌లో చైనా దీవులు నిర్మించి మిలిటరీ బేస్‌లు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.