ఉండవల్లిలోని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద వైసీపీ నేతలు శుక్రవారం ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త నెలకొన్నది. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ సంస్మరణ సభలో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ సహా పలువురు నాయకులు, కార్యకర్తలు బాబు నివాసం ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా ప్రధాన ద్వారం వద్ద వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌తోపాటు పార్టీ కార్యకర్తలు బైఠాయించారు. దీంతో టీడీపీ-వైసీపీ పార్టీ కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల పోటాపోటీ నినాదాలతో తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు అక్కడ భారీగా పోలీసుల మోహరించారు. ఈ క్రమంలో లాఠీచార్జి చేశారు.
అంతేకాకుండా వైసీపీ ఆందోళన సమాచారం అందుకున్న పలువురు టీడీపీ నేతలు చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో పాటు బుద్దా వెంకన్న, పట్టాభితో పాటు పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకొని వైసీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో బుద్దా వెంకన్న సొమ్మసిల్లి పడిపోయారు. కాగా ఆందోళనకారుల దాడిలో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ కారు అద్దం ధ్వంసమైంది.
జగన్ ప్రభుత్వ దౌర్జన్యానికి పరాకాష్ఠ: టీడీపీ
వైసీపీ నేతలు చంద్రబాబు ఇంటికి వచ్చి రౌడీల్లా ప్రవర్తించారని టీడీపీ నేత పట్టాభి మండిపడ్డారు. డీజీపీ దగ్గరుండి అధికార పార్టీ నేతలను దాడికి ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలపై పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారని, పోలీసులే బుద్దా వెంకన్నను కింద పడేసి కొట్టారని గద్దె రామ్మోహన్ ఆరోపించారు. వైసీపీ నేతలు చంద్రబాబు ఇంటిపై దాడిచేయాలనే ఉద్దేశంతో వచ్చారని బుద్దా వెంకన్న అన్నారు. అధికార పార్టీ నేతలు తమపై దౌర్జన్యం చేయడాని గుండాల్లా వచ్చారని.. దాడిచేసి కొట్టారని పేర్కొన్నారు. జగన్ సర్కారు దౌర్జన్యానికి ఇది పరాకాష్ఠ అన్ని ఆయన ఆక్షేపించారు.
చంద్రబాబే ఆరోపణలు చేయించారు: జోగి రమేశ్
చంద్రబాబు నాయుడు కావాలనే జగన్‌పై ఆరోపణలు చేయించారని జోగి రమేశ్ ఆరోపించారు. చంద్రబాబే తనపై రాళ్లు వేయించారని.. టీడీపీ కార్యకర్తలు తన కారు అద్దాలను ధ్వంసం చేశారని అన్నారు. ఈ నేపథ్యంలో గోగి రమేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.