తిరుపతి గోవిందరాజ స్వామి పవిత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు స్నపనతిరుమంజనం జరిగింది.
ఇందులో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, పసుపు, చందనంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం మూలవర్లకు, బాలాలయంలోని స్వామివారి మూర్తికి, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, పరివార దేవతలకు, ధ్వజస్తంభానికి, శ్రీమఠం ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో పెద్ద జీయర్‌స్వామి, చినజీయర్ స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈఓ రాజేంద్రుడు, ఆలయ ప్రధానార్చకులు పీ శ్రీనివాస దీక్షితులు, ఆగమ సలహాదారు వేదాంతం విష్ణుభట్టాచార్యులు, ఏఈవో రవికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్ నారాయణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ కామరాజు పాల్గొన్నారు.