టీడీపీ అధినేత చంద్రబాబును చంపేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నించారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయన్న పాత్రుడు ఆరోపించారు. ప్రతిపక్ష నేత ఇంటిపై దాడి చేయడం అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని చెప్పారు. సీఎంగా పనిచేసిన వారికే రాష్ట్రంలో రక్షణ లేకపోతే ఎట్లా అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు రెండో వర్ధంతి సందర్భంగా ఆయన సొంతూరైన గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో గురువారం కోడల విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది.
విగ్రహావిష్కరణకు వచ్చని అయ్యన్నపాత్రుడు ఈ సందర్భంగా సీఎం జగన్, మంత్రులపై విమర్శలు చేశారు. దీంతో అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలను నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్, పార్టీ నాయకులు చంద్రబాబు ఇంటి ముట్టడికి తీవ్రంగా యత్నించారు. ఈ క్రమంలో ఘర్షణ చోటుచేసుకున్నది. దీనిపై విశాఖ నర్సీపట్నంలో రైతు కోసం టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్న అయ్యన్నపాత్రడు స్పందించారు. మంత్రులు చేసిన పనులు, ప్రభుత్వ విధానాలపై మాత్రమే సభలో చెప్పానన్నారు. అంతేతప్ప నేనేవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదని తెలిపారు.
‘ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంపై దాడి చేయడం పద్ధతి కాదు. దాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలి. ముఖ్యమంత్రిని నేను తిట్టలేదు. చర్చిలో ఫాదర్లు ఓ మై సన్ అంటారు. అందే రీతిలో తెలుగులో అన్నాను. నా వ్యాఖ్యలపై వైకాపా శ్రేణులు కావాలనే రచ్చ చేస్తున్నారు. నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రుల పనులను బట్టే సంబోధించాను. నా మాటల్లో తిట్లు ఎక్కడ ఉన్నాయో చెప్పాలి’ అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు.