అంతర్జాతీయం ముఖ్యాంశాలు

బరదార్‌ను కొట్టిన హక్కానీ.. ఇరు వర్గాల మధ్య కాల్పులకు కారణం

ఆఫ్ఘనిస్థాన్‌ను మరోసారి తమ నియంత్రణలోకి తెచ్చుకున్న తాలిబన్‌లోని రెండు వర్గాల మధ్య విభేదాలు ఇటీవల బయటపడ్డాయి. తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు, తాత్కాలిక ప్రభుత్వంలోని డిప్యూటీ ప్రధాని అయిన ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్‌ ను హక్కానీ నెట్‌వర్క్‌ ప్రముఖ నేత ఖలీల్ ఉల్ రహమాన్ హక్కానీ కొట్టాడు. తన సీటు నుంచి లేచిన హక్కానీ, బరదార్‌ వద్దకు వెళ్లి పంచ్‌లిచ్చాడు. కాబూల్‌లోని అధ్యక్షుడి భవనంలో ఈ నెల మొదట్లో జరిగిన ఈ ఘటన, రెండు వర్గాల మధ్య కాల్పులకు దారి తీసిందని బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది.

అమెరికా అండతో పాకిస్థాన్‌ జైలు నుంచి విడుదలైన బరదార్‌, దోహాలోని తాలిబన్ రాజకీయ కార్యాలయానికి అధిపతిగా ఉన్నాడు. ఆఫ్ఘన్‌ నుంచి అమెరికా దళాల ఉపసంహరణకు సంబంధించిన కీలక శాంతి చర్చల్లో పాల్గొన్న ఆయన ఈ మేరకు అమెరికాతో కుదిరిన ఒప్పందంపై సంతకాలు చేశాడు. ఆఫ్ఘనిస్థాన్‌ మరోసారి తాలిబన్ల నియంత్రణలోకి రావడానికి తన రాజకీయ చర్చలే కీలకంగా గుర్తించాలని డిమాండ్‌ చేశాడు. అంతర్జాతీయ సమాజానికి మరింత ఆమోదయోగ్యమైన అన్ని వర్గాలను కలుపుకొని క్యాబినెట్ ఏర్పాటు, ప్రభుత్వ నిర్మాణం గురించి తాలిబన్‌ వర్గాలతో చర్చించాడు.

ఈ చర్చ వేడెక్కగా ఆగ్రహించిన మంత్రి ఖలీల్ ఉల్ రహమాన్ హక్కానీ తన సీటు నుంచి లేచి వచ్చి బరదార్‌ను కొట్టడం ప్రారంభించాడని, దీంతో బరదార్‌, హక్కానీ బాడీ గార్డులు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారని దీని గురించి తెలిసిన వారు చెప్పినట్లు బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన కొందరు చనిపోగా మరి కొందరు గాయపడినట్లు వివరించింది.

కాగా, ఈ కాల్పుల్లో బరదార్‌ చనిపోవడం లేదా గాయపడినట్లు వదంతులు వ్యాపించాయి. అయితే బరదార్‌కు ఏమీ కాలేదని, ఈ పరిణామం అనంతరం తాలిబన్‌ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుంజాదాతో మాట్లాడటానికి ఆయన కాబూల్‌ను వీడి కాందహార్‌కు వెళ్లారని ఆ నివేదిక పేర్కొంది. ఈ ఘటన నేపథ్యంలో తాలిబన్‌ తాత్కాలిక ప్రభుత్వం నుంచి బరదార్‌ తప్పుకున్నారని, అంతగా తెలియని ముల్లా మహమ్మద్ హసన్‌ తాత్కాలిక ప్రధాన మంత్రిగా నియమితులయ్యారని వెల్లడించింది.

అయితే బరదార్‌, హక్కానీ మధ్య ఘర్షణ, కాల్పుల ఘటనను తాలిబన్‌ పదే పదే ఖండించింది. మరోవైపు తాను బతికే ఉన్నట్లు బరదార్‌ ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేశాడు. దీనిని నిరూపించేందుకు అధికార టీవీలో ఆయన కనిపించాడు. తమ మధ్య అంతర్గత విభేదాలు ఉన్నట్లుగా వచ్చిన వార్తలు అవాస్తవమని అన్నాడు.

కాగా, 2016లో తాలిబన్‌, హక్కానీ నెట్‌వర్క్‌ కలిసిపోయాయి. తాలిబన్‌ తాత్కాలిక ప్రభుత్వంలో హక్కానీ గ్రూప్‌కు నాలుగు కీలక పోస్టులు లభించాయి. నిషేధిత ఉగ్రవాదిగా అమెరికా ముద్ర వేసిన సిరాజుద్దీన్ హక్కానీని తాత్కాలిక అంతర్గత మంత్రిగా నియమించారు.