ఆంధ్రప్రదేశ్

చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు : రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌

చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసని వైసీపీ రాజమండ్రి ఎంపీ భరత్‌ అన్నారు. తనపై సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై ఆయన మంగళవారం వివరణ ఇచ్చారు. ‘మా కుటుంబం గురించి ఏపీ ప్రజలందరికీ తెలుసు. కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నానని అంటున్నారు. అటువంటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. నాపై ఆరోపణలు చేసేముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి’. అని హితవు పలికారు.

అంతేకాకుండా వీవీ లక్ష్మినారాయణతో నేను సెల్ఫీలు తీసుకున్నానని చెబుతున్నారు. అదేంలేదని చెప్పారు. కాపు సమావేశంలో ఆయనను కలిశాను. నేను పార్లమెంట్‌లో చాలా బాగా మాట్లాడానని లక్ష్మినారాయణ అన్నారు. అంతేతప్ప నేను వెళ్లి సెల్ఫీ తీసుకోలేదు.. వీడియో దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది అని ఎంపీ భరత్‌ పేర్కొన్నారు. తమ పార్టీలోని ఒక నాయకుడు టీడీపీ నాయకులతో కుమ్మక్కై తనపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిన్న ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌రామ్‌ను ఉద్దేశించి చేసిన విషయం తెలిసిందే.