తెలంగాణ ముఖ్యాంశాలు

Rain Alert | తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన

రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. బెంగాల్‌ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుందని, అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఉందని తెలిపింది. దక్షిణ గాంగటక్‌ నుంచి తెలంగాణ వరకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతుందని చెప్పింది. వీటి ప్రభావంతో తెలంగాణలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. బుధవారం ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్‌, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని చెప్పింది. ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని చెప్పింది.