ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

TTD Covid Rules | తిరుమల దర్శనానికి వెళ్లాలంటే ఇవి కచ్చితం.. స్పష్టం చేసిన టీటీడీ

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనం టోకెన్లను సెప్టెంబర్ 25న ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. శనివారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 31 వరకు రోజుకు ఎనిమిది వేల సర్వ దర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. సెప్టెంబర్‌ 26 నుంచి తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపి వేస్తామన్నారు.

సర్వదర్శనం టోకెన్ల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు గుమికూడుతుండటం వల్ల కరోనా వేగంగా సంక్రమించే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ కానీ, దర్శనం సమయానికి మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకుని.. నెగిటివ్ సర్టిఫికెట్ గానీ తప్పనిసరిగా తీసుకురావాలని స్పష్టం చేశారు. కొవిడ్ నియంత్రణకు టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.