అంతర్జాతీయం ముఖ్యాంశాలు

Pak FM Qureshi : లండన్‌లో పాక్‌ మంత్రికి చుక్కెదురు.. వెల్లువెత్తిన నిరసనలు

 (Pak FM Qureshi) పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషికి లండన్‌లో చుక్కెదురైంది. అక్కడి కశ్మీర్ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది. కశ్మీర్‌తోపాటు సింధ్‌, బలూచ్ ఫోరం కార్యకర్తలు లండన్‌లోని ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ నివాసం ఎదుట ప్రదర్శన నిర్వహించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో వినాశనానికి కారకమైన పాకిస్తాన్‌ను నమ్మొద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు.

పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి షా మెహమూద్‌ ఖురీషి మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సోమవారం బ్రిటన్ వచ్చారు. ఆయన రాకను నిరసిస్తూ గులాం కశ్మీర్ ప్రజలు, జమ్ముకశ్మీర్ గిల్గిట్, బాల్టిస్తాన్, లడఖ్ నేషనల్ ఈక్వల్ పార్టీ సజ్జాద్ రాజా నేతృత్వంలో పాకిస్తాన్ హైకమిషనర్ నివాసం ముందు గుమిగూడారు. కశ్మీర్‌లో నివసిస్తున్న కశ్మీరీల అణిచివేతను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రవాదానికి కొమ్ముకాస్తున్న పాకిస్తాన్‌కు బ్రిటన్‌ ప్రభుత్వం నిధులను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన్ ద్వంద్వ పాత్ర గురించి, ఆఫ్ఘన్‌ వినాశనానికి కారణమైన పాకిస్తాన్‌ను నమ్మవద్దని బ్రిటిష్‌ ప్రభుత్వానికి, అంతర్జాతీయ సమాజానికి తెలియజేసేందుకే ఈ ఆందోళన చేపట్టినట్లు నిరసనకారులు తెలిపారు. పాకిస్తాన్ ప్రవాసులు ఇలా తమ దేశ మంత్రికి వ్యతిరేకంగా లండన్‌లో నిరసనలు తెలుపడం గతంలో జరుగలేదు.