రైతుల ‘భారత్ బంద్’ సందర్భంగా ఒక పోలీస్ అధికారికి చేదు అనుభవం ఎదురైంది. నిరసనకారుడి కారును అడ్డుకునేందుకు ప్రయత్నించగా బూటు పైనుంచి కారు టైర్ వెళ్లింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. సోమవారం ‘భారత్ బంద్’ నేపథ్యంలో బెంగళూరు సిటీ నార్త్ డివిజన్ డీసీపీ మీనా భద్రతను పర్యవేక్షించారు. గోరగుంటెపాళ్య వద్ద ఒక పార్టీ కార్యకర్త ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపడానికి ఆయన ప్రయత్నించారు.
అయితే అతడు కారును ఆపకుండా పోనివ్వడంతో కారు ముందు టైర్ డీసీపీ మీనా బూటు పైనుంచి వెళ్లింది. దీంతో ఆయన కాలికి తీవ్రంగా గాయమైంది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు డీసీపీ కాలు పైనుంచి కారును నడిపిన నిరసనకారుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.