Neet-PG Syllabus Changed | పీజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్-పీజీ సూపర్ స్పెషాలిటీ పరీక్ష -2021లో చివరి క్షణంలో సిలబస్ మార్చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఆధిపత్య పోరులో విద్యార్థులతో ఆటలాడుకోవద్దని సోమవారం కేంద్ర ప్రభుత్వ అధికారులను హెచ్చరించింది. యువ విద్యార్థులను ఫుట్‌బాల్ మాదిరిగా ఆడుకోవాలని భావించొద్దని పేర్కొన్నది. దీనిపై వచ్చే సోమవారం లోపు తన వైఖరిని తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై సంబంధిత శాఖలు, సంస్థల అధికారులతో సమావేశం నిర్వహించాలని సూచించింది.
నీట్ పీజీ సూపర్ స్పెషాలిటీ పరీక్ష – 2021 నిర్వహణకు రెండు నెలల ముందు ప్రభుత్వం సిలబస్ మార్చేసిందని విద్యార్థుల ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా 41 మంది పీజీ క్వాలిఫైడ్ వైద్య విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
2018లో 40 శాతం జనరల్ మెడిసిన్, 60 శాతం సూపర్ స్పెషాలిటీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇచ్చేవారని విద్యార్థులు తెలిపారు. కానీ ఈ సారి చివరి క్షణంలో సిలబస్ మార్చేశారని విద్యార్థుల అభియోగం. 100 శాతం ప్రశ్నలు కూడా జనరల్ మెడిసిన్ నుంచి అడిగారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.