జాతీయం తెలంగాణ

Central Vista: మోదీ ఒంటరిగా పరిశీలించడం తప్పు: అసదుద్దీన్ ఒవైసీ

కొత్త పార్లమెంట్‌ సెంట్ర‌ల్ విస్టా నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ ఒంటరిగా పరిశీలించడం తప్పు అని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అధికారాల విభజన సిద్ధాంతాన్ని మోదీ ఉల్లంఘించారని ఆయన విమర్శించారు. సభకు సంరక్షకుడైన లోక్‌సభ స్పీకర్ ప్రధాని మోదీ వెంట ఎందుకు లేరు? అని ప్రశ్నించారు. లోక్‌సభ స్పీకర్‌తో కలిసి కాకుండా ప్రధాని మోదీ ఒంటరిగా వెళ్లి కొత్త పార్లమెంట్‌ నిర్మాణాన్ని పరిశీలించడం చాలా తప్పన్నారు.

‘సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం పార్లమెంట్. అధికారాల విభజన సిద్ధాంతం ప్రకారం న్యాయవ్యవస్థ లేదా శాసనసభ కార్యకలాపాల్లో కార్యనిర్వాహక విభాగం జోక్యం చేసుకోదని సుప్రీంకోర్టు చెప్పింది. ఎగ్జిక్యూటివ్‌లో భాగమైన ప్రధాని మోదీ దీనిని ఉల్లంఘించారు’ అని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. లోక్‌సభ స్పీకర్‌ వెంట లేకుండా మోదీ ఒంటరిగా కొత్త పార్లమెంట్‌ నిర్మాణ పనుల పరిశీలనకు వెళ్లకూడదని అన్నారు.

మూడు రోజుల అమెరికా ప‌ర్య‌ట‌న ముగించుకుని ఆదివారం ఢిల్లీకి చేరుకున్న ప్ర‌ధాని మోదీ, నూత‌న పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ విస్టా ప‌నుల పురోగ‌తిని ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఎవరికీ ఎటువంటి స‌మాచారం ఇవ్వకుండా, సెక్యూరిటీ లేకుండానే ఆయ‌న అక్క‌డికి చేరుకున్నారు. ఆదివారం రాత్రి 8.45 గంట‌ల‌కు సంద‌ర్శించి గంట సేపు గ‌డిపారు. నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించారు. కాగా, మోదీ చర్యను అసదుద్దీన్ ఒవైసీ తప్పుపట్టారు.