ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా కె.జానకిరామిరెడ్డి 455 ఓట్ల మెజార్టీతో సమీప అభ్యర్థి కె.సత్యనారాయణమూర్తిపై ఘన విజయం సాధించారు. గట్టి పోటీ ఇస్తారనుకున్న పోపూరి ఆనంద్ శేషు 353 ఓట్లతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1,538 ఓట్లు పోలయ్యాయి. కోవిడ్ నేపథ్యంలో ఆన్‌లైన్ విధానం ద్వారా మంగళవారం ఓటింగ్ నిర్వహించారు. ఎన్నికల అధికారిగా సీనియర్ న్యాయవాది అప్పారి సత్యప్రసాద్ వ్యవహరించారు. సంఘం ప్రధాన కార్యదర్శిగా కోనపల్లి నర్సిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికవగా.. ఉపాధ్యక్షుడిగా పి.నరసింహమూర్తి విజయం సాధించారు.
సంయుక్త కార్యదర్శిగా దూదేకుల ఖాసిం సాహెబ్, గ్రంథాలయ కార్యదర్శిగా మెట్టా సప్తగిరి, కోశాధికారిగా డాక్టర్ జేవీఎస్‌హెచ్ శాస్త్రి, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా సందు సతీష్, మహిళా ప్రతినిధిగా ఎ.సుఖవేణి, ఈసీ సభ్యులుగా బాలినేని పరమేశ్వరరావు, ఎస్‌వీ భరతలక్ష్మి, ఈతకోట వెంకటరావు, కట్టా సుధాకర్, మేటపాటి సంతోష్‌రెడ్డి, రావుల నాగార్జున ఎన్నికయ్యారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు ఎన్నికల అధికారి సత్యప్రసాద్‌ను సంఘ ప్రతినిధులు అభినందించారు. కొత్తగా ఎన్నికైన ప్రతినిధులకు, వారి గెలుపునకు కృషి చేసిన వారికి వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి అభినందనలు తెలిపారు.