డెంగ్యూ వ్యాక్సిన్‌కు సంబంధించి మరింత విస్తృతంగా ట్రయల్స్ నిర్వహించనున్నట్లు ఐసీఎంఆర్ డైరక్టర్ జనరల్ డాక్టర్ బల్‌రామ్ భార్గవ్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డెంగ్యూ వ్యాక్సిన్ చాలా ముఖ్యమైందని, కొన్ని డెంగ్యూ స్ట్రెయిన్లపై ప్రస్తుతం ఇండియాలో అధ్యయనం సాగుతోందని, అయితే ఆ కంపెనీలు చాలా వరకు విదేశాల్లో తొలి దశ ట్రయల్స్ చేశాయని, ఇండియాలో ఎక్కువ స్థాయిలో ట్రయల్స్ నిర్వహించాలని భావిస్తున్నట్లు ఐసీఎంఆర్ చీఫ్ తెలిపారు.
ఇక కోవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌వో అనుమతి గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు కోవాగ్జిన్ డేటాను పూర్తిగా సమర్పించినట్లు తెలిపారు. ఆ డేటాను డబ్ల్యూహెచ్‌వో పరిశీలిస్తోందన్నారు. త్వరలోనే కోవాగ్జిన్‌కు ఎమర్జెన్సీ అనుమతిపై డబ్ల్యూహెచ్‌వో నిర్ణయం తీసుకుంటుందని డాక్టర్ బల్‌రామ్ భార్గవ్ తెలిపారు. దేశంలోని ప్రజలందరికీ రెండు డోసుల టీకా ఇవ్వడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ప్రస్తుత దశలో బూస్టర్ డోసు గురించి ఆలోచించడం లేదని ఆయన తెలిపారు.
పండుగ సీజన్ సమీపించిందని, ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ తెలిపారు. సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. మాస్క్‌లను తప్పనిసరిగా ధరించాలన్నారు. కోవిడ్ ప్రవర్తనానియమావళి ప్రకారం పండుగలను సెలబ్రేట్ చేసుకోవాలని సూచించారు. కేరళలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నట్లు చెప్పారు. దేశంలో ఉన్న కేసుల్లో 52 శాతం యాక్టివ్ కేసులు ఆ రాష్ట్రంలో ఉన్నట్లు తెలిపారు. మహారాష్ట్ర, తమిళనాడు, మీజోరం, కర్నాటక, ఏపీల్లో అధిక కేసులు నమోదు అవుతున్నాయని రాజేశ్ తెలిపారు.