జాతీయం ముఖ్యాంశాలు

Covid-19 | దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసులు పెరిగాయి. బుధవారం 18,870 కేసులు నమోదవగా, తాజాగా దానికి ఐదు వేలు అధికంగా కొత్త కేసులు రికార్డయ్యాయి. దీంతో మార్చి 11 తర్వాత 20 వేల దిగువకు చేరిన రోజువారీ కేసులు మళ్లీ ఇరవై వేల మార్కును దాటాయి.

దేశంలో కొత్తగా 23,529 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3,37,39,980కు చేరింది. ఇందులో 3,30,14,898 మంది కరోనా నుంచి బయటపడగా, మరో 4,48,062 మంది బాధితులు ప్రాణాలొదిరారు. ఇంకా 2,77,020 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. కాగా, గత 24 గంటల్లో 28,718 మంది వైరస్‌ నుంచి కోలుకోగా, కొత్తగా 311 మంది మృతిచెందారు.

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధిక వాటా కేరళదే ఉన్నది. రాష్ట్రంలో నిన్న 12,161 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 155 మంది కరోనాకు బలయ్యారని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నది. నిన్న ఒక్కరోజే 65,34,306 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు 88,34,70,578 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్యశాఖ పేర్కొన్నది.

సెప్టెంబర్‌ 29 వరకు 56,89,56,439 నమూనాలను పరీక్షించామని, ఇందులో బుధవారం 15,06,254 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) తెలిపింది.