ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

టీటీడీలో తప్పు చేస్తే దేవుడే శిక్షిస్తాడు

సంప్రదాయం ప్రకారం పూజలు జరగడం లేదన్న పిటిషన్‌పై సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ

విచారణ జాబితాలో త్వరగా చేర్చాలని రిజిస్ట్రీని బెదిరిస్తారా?

శ్రీవారి భక్తులకు సహనం ఉండాలని పిటిషనర్‌కు హితవు

వారంలో కౌంటరు దాఖలు చేస్తామన్న టీటీడీ 

టీటీడీలో తప్పు చేస్తే దేవుడే శిక్షిస్తాడని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ వ్యాఖ్యానించారు. తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామికి సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించడం లేదంటూ ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీవారి దాదా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హిమ కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్‌తో జస్టిస్‌ ఎన్‌వీ రమణ తెలుగులో మాట్లాడుతూ.. ‘పేరు ఇలా ఉందేమిటి? అసలు పేరు ఏమిటి’ అని అడిగారు. తన పేరు శ్రీవారి దాసానుదాసుడు అని, ఏలూరి శేషయ్య కుమారుడినని, అందరూ తనను శ్రీవారి దాదా అని పిలుస్తారని పిటిషనర్‌ చెప్పగా, వ్యవహారాల్లో అసలు పేరు ఉపయోగించాలని హితవు పలికారు.

పిటిషనర్‌ వ్యక్తిగతంగా వాదన వినిపించడానికి అనుమతి ఇవ్వడంతో తిరుమలలో పూజలు సంప్రదాయంగా జరగడం లేదంటూ సమస్యలు ఏకరువు పెడుతుండగా.. జస్టిస్‌ ఎన్వీ రమణ అతన్ని నిలువరించారు. ‘పిటిషన్‌ను జాబితాలో త్వరగా చేర్చాలని ప్రతిరోజూ రిజిస్ట్రీని బెదిరిస్తారా? ఏమంత అత్యవసరం వచ్చింది? పూజలు ఎలా నిర్వహించాలి? ఎప్పుడు నిర్వహించాలో జోక్యం చేసుకొనే అవసరం ఏమిటి? ఏ చట్ట ప్రకారం కోర్టులు జోక్యం చేసుకోవాలి? ఇదేమైనా రాజ్యాంగ ఉల్లంఘనా? ఎంత మందిని దర్శనానికి అనుమతించాలనే అంశంపై టీటీడీని ప్రశ్నించడం ప్రాథమిక హక్కు కిందకు రాదు.

నాతో సహా న్యాయమూర్తులు అందరూ శ్రీవేంకటేశ్వరస్వామి వారికి భక్తులే. పూజలు సంప్రదాయంగా జరగాలనే కోరుకుంటాం’ అని జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఈ దశలో పిటిషనర్‌ జోక్యం చేసుకోబోగా వారిస్తూ.. శ్రీవారి భక్తులకు సహనం ఉండాలని సూచించారు. గతేడాది మార్చిలో పిటిషనర్‌ ఇచ్చిన వినతిపత్రంపై ఏం చర్యలు తీసుకున్నారని టీటీడీ తరఫు న్యాయవాది సత్య సభర్వాల్‌ను ప్రశ్నించారు. వారం రోజుల్లో కౌంటరు దాఖలు చేస్తామని ఆయన తెలుపడంతో తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేస్తున్నట్లు జస్టిస్‌ ఎన్‌వీ రమణ తెలిపారు.