మానవ అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో 303 మంది భారతీయులతో నికరాగువా వెళుతున్న విమానాన్ని ఫ్రాన్స్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రయాణికుల్లోని ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం తాజాగా స్పందించింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించింది.‘303 మంది ప్రయాణికులతో నికరాగువా వెళుతున్న విమానాన్ని ఆపేసినట్లు ఫ్రాన్స్ అధికారులు తెలియజేశారు. వీరిలో ఎక్కువ మంది భారతీయులు దుబాయ్ నుంచి నికరాగువా వెళుతున్నారు. మానవ అక్రమరవాణా జరుగుతోందనే సమాచారం అందడంతో ఫ్రాన్స్ విమానాశ్రయంలో విమానాన్ని నిలిపివేశారు. ఎంబసీ బృందానికి కాన్సులర్ యాక్సెస్ లభించింది. పరిస్థితిని పరిశీలిస్తున్నాం. ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. ప్రయాణికుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నాం’ అంటూ భారత ఎంబసీ ట్వీట్ చేసింది.
కాగా, దుబాయ్ నుంచి 303 మంది భారతీయ ప్రయాణికులతో మధ్య అమెరికాలోని నికరాగ్వాకు వెళ్తున్న ఓ విమానాన్ని ‘మానవ అక్రమ రవాణా’ అనుమానంతో ఫ్రాన్స్‌లో అధికారులు తమ అధీనంలోకి తీసుకొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి అందిన సమాచారంతో.. ఇంధన రీఫిల్లింగ్ కోసం వట్రీ ఎయిర్‌పోర్టులో దిగిన విమానాన్ని అధికారులు నిర్బంధించారని పారిస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం శుక్రవారం పేర్కొంది.ప్రయాణికులంతా హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులు కావొచ్చని అభిప్రాయపడింది. దీనిపై దేశ వ్యవస్థీకృత నేరాల వ్యతిరేక యూటిన్ ‘జునాల్కో’ దర్యాప్తు చేపట్టిందని తెలిపింది. అసలు ఈ విమానం ఎక్కడకు, ఎందుకు వెళ్తుంది? అనే కారణాలను తేల్చేందుకు విచారణ ప్రారంభం అయిందని ఈస్టర్న్ మార్నే రీజియన్ స్థానిక అధికారులు వెల్లడించారు. రొమానియన్ కంపెనీ లెజెండ్ ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తున్న ఈ ఏ340 విమానం ఇంధన రీఫిల్లింగ్ కోసం దిగిందని పేర్కొన్నది. అమెరికా లేదా కెనడాలోకి అక్రమంగా ప్రవేశించే ప్లాన్‌లో భాగంగా భారతీయ ప్రయాణికులు ముందు మధ్య అమెరికా వెళ్తున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.