కేరళలో కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. రోజువారీ కొత్త కేసుల సంఖ్య ఇంకా 10 వేలకు పైనే నమోదవుతున్నది. ఇవాళ కూడా కొత్తగా 13,834 మంది కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 46,94,719కి చేరింది. ఇక కరోనా మరణాలు కూడా ప్రతిరోజూ 100కు అటుఇటుగా నమోదవుతున్నాయి. ఇవాళ కొత్తగా 95 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 25,182కు పెరిగింది.
ప్రస్తుతం కరోనా మరణాలు, రికవరీలు పోను రాష్ట్రంలో మొత్తం 1,42,499 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జి తెలిపారు. వారిలోనూ కేవలం 11.5 శాతం మంది మాత్రమే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇక రాష్ట్రంలో ఇవాళ నమోదైన మొత్తం కేసులలో త్రిసూర్ జిల్లా నుంచి ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలో ఇవాళ 1,823 కొత్త కేసులు నమోదయ్యాయి.