india-nda
ముఖ్యాంశాలు

I.N.D.I.A vs NDA: ముంబైలో సెప్టెంబర్ 1న ‘ఎన్డీఏ’ వర్సెస్ ‘ఇండియా’..! నువ్వా.. నేనా?

జాతీయ స్థాయిలోని ప్రధాన రాజకీయ కూటములు ‘ఎన్డీఏ’, ‘ఇండియా’లు మరోసారి ఒకే రోజు పోటా పోటీ భేటీలను నిర్వహించనున్నాయి. అధికార కూటమి ‘ఎన్డీఏ’, ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’లు ఒకే రోజు, ఒకే నగరంలో కీలక సమావేశాలను నిర్వహిస్తున్నాయి.

సెప్టెంబర్ 1న, ముంబైలో అధికార కూటమి ‘ఎన్డీఏ’, ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ లు పోటా పోటీ భేటీలను నిర్వహించనున్నాయి. విపక్ష కూటమి ఇండియా కు ఇది మూడో జాతీయ స్థాయి సమావేశం. దేశవ్యాప్తంగా ఉన్న 26 ఎన్డీయేతర రాజకీయ పార్టీలు గత సమావేశంలో పాలు పంచుకున్నాయి. ఈ సంవత్సరం మరో రెండు లేదా మూడు పార్టీలు ఈ కూటమిలో చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ‘ఇండియా’ కీలక నేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంకేతాలిచ్చారు.

ముంబైలో ‘ఎన్డీఏ’ భేటీ జరగనున్నందున మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ, శివసేన (షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) ఈ సమావేశంలో కీలక పాత్ర పోషించనుంది. ఈ సమావేశంలో శివసేన (షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) పాల్గొంటున్నాయని ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) ఎంపీ సునిల్ తత్కరే వెల్లడించారు. విపక్ష ఇండియా కూటమి సమావేశానికి పోటీగానే ఎన్డీయే సమావేశాన్ని ముంబైలో అదేరోజు నిర్వహించాలనుకోవడంపై స్పందిస్తూ.. సెప్టెంబర్ 1వ తేదీన ఎన్డీయే సమావేశాన్ని ముంబైలో నిర్వహిాంచాలన్న నిర్ణయం చాలా రోజుల క్రితమే తీసుకున్నారని వివరించారు. రెండు కూటములు ఒకే రోజు, ఒకే నగరంలో సమావేశాలు నిర్వహించడం కాకతాళీయమేనన్నారు.

ప్రధాని అభ్యర్థిని ప్రకటించే సాహసం ఇండియా కూటమికి లేదన్న బీజేపీ నేతల విమర్శలపై కాంగ్రెస్ నేత పీఎల్ పునియా స్పందిస్తూ.. లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ప్రధానిగా ఎవరు ఉండబోతున్నారన్నది ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయిస్తామన్నారు. ముంబైలో జరిగే సమావేశంలో రాష్ట్రాల వారీగా సీట్ల పంపకాలపై ప్రాథమికంగా చర్చ జరిగే అవకాశముందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అలాగే, ‘ఇండియా’ కూటమి కామన్ లోగోను కూడా ఆవిష్కరించే అవకాశముందన్నారు.