ఉస్మానియా విశ్వవిద్యాలయ 81వ స్నాతకోత్సవంలో భాగంగా ఈ నెల 27వ తేదీన జరిగే కార్యక్రమంలో డిగ్రీ పట్టాలను అందుకోవాలనుకునే పీహెచ్‌డీ అభ్యర్థులు ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ శుక్రవారం తెలిపారు. బంగారు పతకాలు అందుకునే అభ్యర్థుల జాబితాను ఉస్మానియా వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌లో చూడాలన్నారు.
18 వరకు డిగ్రీ సప్లిమెంటరీ, ఇన్‌స్టంట్ పరీక్షల ఫీజు చెల్లింపు
ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ కోర్సుల 1, 3, 5 బ్యాక్‌లాగ్‌లతో పాటు కోవిడ్ కారణంగా ప్రత్యేకంగా నిర్వహిస్తున్న డిగ్రీ ఇన్‌స్టంట్ 6వ సెమిస్టర్ పరీక్షల ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 18 వరకు చెల్లించవచ్చునని ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేష్ శుక్రవారం తెలిపారు. రూ.200 అపరాధ రుసుముతో 23 వరకు, రూ.500 రుసుముతో 26, 27 వరకు, రూ.1000 రుసుముతో 28, 29 వరకు, రూ.2000 రుసుముతో నవంబరు 1, 2 వరకు, రూ.5000 అపరాధ రుసుముతో నవంబరు 3 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చునన్నారు. వివరాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ చూడాలన్నారు.
26 నుంచి ఎంబీఏ పరీక్షలు
ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో ఈ నెల 26 నుంచి వచ్చే నెల 6 వరకు ఎంబీఏ రెగ్యులర్ 2వ సెమిస్టర్, బ్యాక్‌లాగ్ 1వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కంట్రోలర్ తెలిపారు. పరీక్షల టైంటేబుల్‌ను ఉస్మానియా వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచామన్నారు.
ఓయూ దూరవిద్యలో సెమిస్టర్ విధానం
ఉస్మానియా విశ్వవిద్యాలయ దూరవిద్య కేంద్రంలో వివిధ కోర్సులలో సెమిస్టర్ పరీక్షా విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. ప్రస్తుతం ఎంబీఏ కోర్సుకు మాత్రమే ఉన్న సెమిస్టర్ పరీక్ష విధానాన్ని ఇతర పీజీ కోర్సులకు కూడా అమలు చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం (2021–22) ఎంసీఏ కోర్సును మూడు నుంచి రెండు సంవత్సరాలకు కుదించి సెమిస్టర్ పరీక్షను అమలుపర్చనున్నారు. రానున్న విద్యా సంవత్సరం (2022–23) నుంచి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, పీజీడీసీఏ కోర్సులకు సెమిస్టర్ పరీక్ష విధానాన్ని అమలు చేస్తామని అధికారులు వివరించారు. అందుకు అనుగుణంగా పీజీ పుస్తకాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. పీజీ తర్వాత డిగ్రీ కోర్సులకు కూడ సెమిస్టర్ పరీక్షా విధానాన్ని ప్రవేశపెట్టేయోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ విద్యా సంవత్సరానికి (2021–22) వివిధ కోర్సులలో జోరుగా అడ్మిషన్లు సాగుతున్నాయన్నారు.
డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశ గడువు పొడిగింపు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ, బీకాం,బీఎస్సీ), పీజీ (బీఎల్‌ఐఎస్‌సీ, ఎంఎల్‌ఐఎస్‌సీ) పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో చేరడానికి ఆలస్య రుసుము రూ. 200 తో చివరి తేదీ అక్టోబర్ 13 వరకు పొడిగించినట్లు వర్సిటీ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను https://www.braouonline.in/లో పొందుపర్చినట్లు వెల్లడించారు. వివరాలకు 7382929570/580 లేదా విశ్వవిద్యాలయ 040–23680290/291/294/295 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు.