అంతర్జాతీయం ముఖ్యాంశాలు

Degrees in Afghan : 2000-2020 మధ్య డిగ్రీలు చెల్లవు : తాలిబాన్‌ విద్యా మంత్రి

(Degrees in Afghan) ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం ఉన్నత విద్యపై కొత్త డిక్రీని జారీ చేసింది. ఈ డిక్రీ ప్రకారం గత 20 సంవత్సరాల్లో గ్రాడ్యుయేషన్, పీజీ చేసిన విద్యార్థుల డిగ్రీలు చెల్లవు. అష్రఫ్ ఘనీ లేదా హమీద్ కర్జాయ్ ప్రభుత్వంలో ఉన్నత విద్యలో డిగ్రీలు పొందిన విద్యార్థులను గుర్తించకూడదని ఆఫ్ఘన్‌ ఉన్నత విద్యాశాఖ మంత్రి అబ్దుల్ బాకీ హక్కానీ చెప్పినట్లు సమాచారం. ఈ ప్రభుత్వాల కాలంలో మతపరమైన విద్యకు విద్యా రంగంలో ప్రాముఖ్యత ఇవ్వలేకపోవడమే దీనికి కారణంగా తెలుస్తున్నది.

ఆఫ్ఘన్ వార్తా సంస్థ టోలో న్యూస్ ప్రకారం, కాబూల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లతో విద్యా మంత్రి హక్కాని సమావేశమై గత 20 ఏండ్లలో విద్యారంగం గురించి చర్చించారు. మతపరమైన విద్యకు ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్ల హక్కానీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. 2000 నుంచి 2020 వరకు అన్ని రకాల గ్రాడ్యుయేషన్‌, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ డిగ్రీలను గుర్తించవద్దని ఆదేశించినట్లు సమాచారం. ఈ 20 ఏండ్లలో పట్టాలు పొందిన వారు ప్రభుత్వ ఉద్యోగాలకు పనికిరారని అన్నట్లు కూడా తెలుస్తున్నది. పీహెచ్‌డీ చేసిన వారి కంటే మదర్సాల్లో చదువుతున్న వారే ఎక్కువ గుణవంతులు, విద్యావంతులుగా ఉంటున్నారని ఆ సమావేశంలో చెప్పినట్లుగా తెలుస్తున్నది.

తాలిబాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పాత నిర్ణయాల వలెనే ఆశ్చర్యం కలిగిస్తున్నది. గత 20 ఏండ్లలో ఆఫ్ఘన్‌లో విద్యారంగం గణనీయంగా మెరుగుపడిందని ప్రపంచంలోని చాలా మంది నిపుణులు అంగీకరిస్తున్నారు. ఇప్పుడు కొత్త తాలిబాన్ పాలనలో మతపరమైన ప్రాతిపదికన మళ్లీ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతుండటం విచారకరమని వారంటున్నారు.