జాతీయం

Devender Singh Rana : ఫారుక్‌ అబ్దుల్లాకు ముఖ్య అనుచరుడి షాక్‌

(Devender Singh Rana) నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) సీనియర్‌ నేత దేవేందర్‌ సింగ్‌ రాణా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఎన్‌సీ పార్టీ అధినేత ఫరూక్‌ అబ్దుల్లాకు తన రాజీనామా లేఖను ఆదివారం పంపించారు. జమ్ముకశ్మీర్‌లో ఫారుఖ్‌ అబ్దుల్లా ముఖ్య అనుచరుడుగా దేవేందర్‌సింగ్‌ రాణాకు పేరున్నది. దేవేందర్‌సింగ్‌తోపాటు సుర్జిత్‌ సింగ్‌ స్లతియా కూడా ఎన్‌సీ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాను దేవేందర్‌ సింగ్‌ రాణా ఫోన్‌ ద్వారా ధ్రువీకరించారు. వీరిద్దరూ త్వరలో బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. 2014 లో జమ్ములోని నాగరోటా అసెంబ్లీ స్థానం నుంచి ఎన్‌సీ టికెట్‌పై గెలిచాడు. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రాజకీయ సలహాదారుగా కూడా పనిచేశారు.

‘దేవేందర్‌సింగ్‌ రాణా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ అధినేత ఆయనతోపాటు స్లతియా రాజీనామాలను ఆమోదించారు. వీరిపై తదుపరి చర్యలు గానీ లేదా వ్యాఖ్యలు చేయడం గానీ అవసరం లేదు’ అని జమ్ముకశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (జేకేఎన్‌సీ) ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. ఇదిలా ఉండగా, ఆదివారం ఢిల్లీ వెళ్లిన దేవేందర్ సింగ్ రాణా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫరూక్‌ అబ్దుల్లా సన్నిహితుడుగా, ఎన్‌సీ పార్టీ ప్రముఖ హిందూ వ్యక్తిగా ఉన్న దేవేందర్ సింగ్ రాణా రాజీనామా జమ్ముకశ్మీర్ రాజకీయాల్లో ఒక కొత్త మలుపును రేకెత్తించడం ఖాయమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దేవేందర్ రాణాకు ప్రజల్లో మంచి పేరున్నది. ఇక్కడి ప్రజలతో మంచి సంబంధాలను కలిగి ఉన్నాడు. జమ్ముకశ్మీర్‌లో ముస్లిం, గుజ్జర్ కమ్యూనిటీ ప్రజల మద్దతును కూడగట్టడంలో ముందుంటాడు.