అంతర్జాతీయం జాతీయం ముఖ్యాంశాలు

త్వరలోనే భారత్‌లో టెస్లా ఎలక్ట్రిక్‌ కార్ల ఉత్పత్తి : నితిన్‌ గడ్కరీ

భారత్‌లో త్వరలోనే టెస్లా ఎలక్ట్రిక్‌ కార్ల ఉత్పత్తి ప్రారంభమవుతుందని, రాబోయే కొద్ది నెలల్లోనే కారును లాంచ్‌ చేసే అవకాశం ఉందని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. భారత్‌ మార్కెట్‌లో ప్రవేశానికి ముందు టెస్లా, ప్రభుత్వానికి మధ్య నిరంతరం చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. టెస్లా భారత్‌లో ఉత్పత్తిని ప్రారంభించడానికి ముందు.. ఇక్కడి నుంచి ఇతరదేశాలకు కార్లను ఎగుమతి చేసేందుకు ఏ సహాయం కావాలన్న ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

చైనాలో తయారైన కార్లు భారతీయ మార్కెట్లోకి రావ్‌

ఎలన్‌ మస్క్‌ కంపెనీ టెస్లా అమెరికా వెలుపల మొట్టమొదటి ప్లాంట్‌ను చైనాలో ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి యూరప్‌తో పాటు పలు దేశాలకు ఎగుమతి చేస్తున్నది. ఆ కార్లను టెస్లా భారత మార్కెట్లో విక్రయించాలని చూస్తున్నది. అయితే, దీనికి భారత ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ టెస్లా తన ప్లాంట్‌ను భారత్‌లో ఏర్పాటు చేయాలని, ఇక్కడి నుంచి ఇతరదేశాలకు ఎగుమతి చేయాలని కోరినట్లు చెప్పారు.

కారు ధర ఎంత ఉంటుందంటే?

టెస్లా కార్లకు సంబంధించి అనేక సందేహాలున్నాయి. భారత మార్కెట్లో టెస్లా ఎలక్ట్రానిక్‌ కారు ధర చాలా ఎక్కువ ఉంటుందనే చాలా మంది భావిస్తున్నారు. అయితే, కార్ల ధర సరసమైందిగా ఉంటుందని కేంద్రమంత్రి స్పష్టత ఇచ్చారు. భారత్‌లో కార్లను తయారు చేసి విక్రయిస్తే కారు ధర దాదాపు రూ.35లక్షలు ఉంటుందని చెప్పారు.

భవిష్యత్‌లో హైడ్రోజన్‌ ఇంధనం ఎగుమతి

రాబోయే సంవత్సరాల్లో పెట్రోల్, డీజిల్ దిగుమతులను నిలిపివేయడం ద్వారా వాటిపై ఆధారపడటాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నితిన్‌ గడ్కరీ తెలిపారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ఆధారపడడం పెంచుతున్నామని, గ్రీన్‌ హైడ్రోజన్‌ భవిష్యత్‌ ఇంధనమని తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో గ్రీన్‌ హైడ్రోజన్‌ను ఎగుమతి చేసే స్థితిలో ఉంటామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో భారతీయ కంపెనీలు సైతం టెస్లాతో సమానంగా నిలుస్తాయని కేంద్రమంతి ఆశాభావం వ్యక్తం చేశారు. కంపెనీలు పరిశోధనలు చేస్తున్నాయని, భద్రత తదితర అంశాల పరంగా కంపెనీలు అనేక మార్పులు చేస్తున్నాయన్నారు.