ప్రస్తుతం సమావేశాలు జరిగే పార్లమెంటు భవనం ఏమాత్రం సురక్షితం కాదని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్‌దీప్ పూరీ వెల్లడించారు. ‘ఇండియా టుడే కాంక్లేవ్ 2021’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పార్లమెంటు భవనం గురించి మాట్లాడారు. బ్రిటిషు పాలకుల సమయంలో ఈ భవన నిర్మాణం జరిగిందని, ఇది పాతబడిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రతిష్ఠాత్మక సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా పార్లమెంటు కొత్త భవనంతోపాటు రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకూ రాజ్‌పథ్ పునర్నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నూతన పార్లమెంటు భవనం నిర్ణీత గడువులోపే పూర్తవుతుందని హర్‌దీప్ పూరీ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది డిసెంబరులో జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాలు నూతన భవనంలోనే జరుగుతాయని చెప్పారు.
‘భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాతి నుంచి పార్లమెంటు సభ్యుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో వసతుల కోసం భవనానికి ఎప్పటికప్పుడు అనేక మరమ్మత్తులు చేస్తూ వస్తున్నాం. నిర్మాణ పరంగా చూసినా పాత భవనం సురక్షితం కాదు. భూకంపాలు వచ్చా సీస్మిక్ జోన్-4లో ఈ భవనం ఉంది. బ్రిటిషు పాలనలో ఈ భవన నిర్మాణం జరిగినప్పుడు ఇది సీస్మిక్ జోన్-2లో ఉంది’ అని హర్‌దీప్ తెలిపారు. సభ్యుల్లో భయాందోళనలను కలిగించడానికి ఈ విషయాలు చెప్పడం లేదని, కేవలం వాస్తవాలను మాత్రమే అందరి ముందు ఉంచుతున్నానని ఆయన స్పష్టం చేశారు.