(ISIS deputy arrest) ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) నాయకుడు అబూ బకర్ అల్-బాగ్దాదీ సన్నిహితుడు సమీ జాసిమ్‌ను పట్టుకోవడంలో ఇరాక్ విజయం సాధించింది. ఐఎస్ డిప్యూటీ హెడ్‌గా వ్యవహరిస్తున్న సమీ జాసిమ్.. ఐఎస్ ఫైనాన్స్ విషయాలను కూడా పర్యవేక్షిస్తున్నాడు. సమీని పట్టుకున్న విషయాన్ని ఇరాక్ ప్రధానమంత్రి ముస్తఫా అల్-కాధిమి ట్వీట్ ద్వారా తెలిపారు.
‘మా హీరోలు-ఇరాక్ భద్రతా దళాలు.. ఎన్నికలు నిర్వహించడంపై దృష్టి పెట్టారు. వారి సహచరులు సమీ జాసిమ్‌ను పట్టుకోవడానికి సంక్లిష్టమైన క్షేత్రస్థాయి కృషిని ప్రారంభించారు’ అని ప్రధానమంత్రి ముస్తఫా పేర్కొన్నారు. 2019 లో అమెరికా ప్రత్యేక దళాలు వాయవ్య సిరియాలో బాగ్దాదీని కాల్చి చంపాయి. ఆ సమయంలో సమీతో పాటు ప్రధాన ఐఎస్ ఉగ్రవాదుల గురించి సమాచారం అందించినందుకు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అవార్డును కూడా ప్రకటించింది.
సమీ జాసిమ్ పూర్తి పేరు సమీ జాసిమ్ ముహమ్మద్ అల్-జాబురి. హాజీ హమీద్ అని కూడా పిలుస్తారు. ఐసిస్ పూర్వీక సంస్థ అల్-ఖైదా ఇన్ ఇరాక్ (ఏక్యూఐ) సభ్యుడిగా రివార్డ్స్ ఫర్ జస్టిస్ వెబ్‌సైట్‌లో ఎఫ్‌బీఐ చూపించింది. ఎఫ్‌బీఐ ప్రకారం, 2014 లో దక్షిణ మోసుల్‌లో ఐసిస్ డిప్యూటీగా పనిచేస్తున్నప్పుడు, అతను ఆర్థిక మంత్రికి ప్రతిరూపంగా పనిచేశాడు. చమురు, గ్యాస్, ఖనిజాల అక్రమ విక్రయాల సమూహం ఆదాయ-ఉత్పాదక కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యత ఈయనకు అప్పగించారు. అమెరికా ట్రెజరీ అతడిని 2015 సెప్టెంబర్ నెలలో బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది.