అంతర్జాతీయం

Sputnik V : ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా ఫార్ములాను దొంగిలించిన రష్యా గూఢచారులు : ది సన్‌ నివేదిక

(Sputnik V) కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ తయారుచేసిన ప్రపంచ దేశాల్లో రష్యా మొదటిది. స్పుత్నిక్ వీ అనే పేరుతో వ్యాక్సిన్ ఉత్పత్తి చేశారు. అయితే, ప్రస్తుతం ఈ టీకా తయారుచేస్తున్న రష్యా కంపెనీ జెమాలయ నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ.. దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నది. ఒక నివేదిక ప్రకారం, ఆక్స్‌ఫర్డ్ – ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ బ్లూప్రింట్‌ను రష్యన్ గూఢచారులు దొంగిలించారు. అదే ఫార్ములా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తయారీకి ఉపయోగించారు.

ది సన్ నివేదిక ప్రకారం, ఆక్స్‌ఫర్డ్ – ఆస్ట్రాజెనెకా కొవిడ్-19 వ్యాక్సిన్ ఫార్ములాను రష్యా దొంగిలించిందని, సొంత స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారీకి ఉపయోగించిదని బ్రిటన్‌ మంత్రులకు సమచారం ఉన్నది. రష్యా కోసం పనిచేస్తున్న గూఢచారులు.. ఆస్ట్రాజెనెకా కంపెనీ నుంచి కోవిషీల్డ్ డిజైన్‌ను దొంగిలించినట్లు తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని మంత్రులకు కొన్ని వర్గాలు చెప్పినట్లు తెలుస్తున్నది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొన్ని నెలల క్రితం స్పుత్నిక్ వీ కరోనా వ్యాక్సిన్ పొందారని వెల్లడించిన సమయంలోనే ఈ వాదన తెరపైకి వచ్చింది. రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ ఆక్స్‌ఫర్డ్ డిజైన్ చేసిన టీకా తరహా టెక్నాలజీని ఉపయోగిస్తుందని నివేదిక పేర్కొన్నది. దీని తర్వాత లోతుగా విచారణ చేపట్టిన బ్రిటన్‌ భద్రతా బృందాలు.. ఖచ్చితంగా కాపీ చేశారన్న నిర్ధరణకు వచ్చినట్లు సమాచారం.

తాను స్పుత్నిక్ వీ టీకా రెండు డోసులు తీసుకున్నానని వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని రష్యన్ పౌరులను కూడా ఆయన కోరారు. అయితే, ఈ టీకా అప్పటికి ఇంకా అంతర్జాతీయంగా ఆమోదించలేదు. అయినప్పటికీ, 70 దేశాలు దీనిని ఉపయోగించేందుకు ఆమోదం తెలిపాయి. సెప్టెంబర్‌లో మాస్కోలో రెండు ప్రారంభ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు ప్రతిష్ఠాత్మక యూకే పత్రిక ‘ది లాన్సెట్‌’లో ప్రచురితమయ్యాయని ది సన్ తన నివేదికలో పేర్కొన్నది.