మనం ఓ జాబ్ కోసం అప్లై చేసినప్పుడు చివర్లో మీ రిప్లై కోసం వేచి చూస్తుంటామని చెబుతుంటాం. కానీ రోజులు, నెలలు గడుస్తున్నా ఆ రిప్లై.. ఎంతకీ రాకపోతే ఇక వదిలేస్తాం. అలాగే ఈ అమ్మాయి కూడా తాను అప్లై చేసుకున్న జాబ్ విషయాన్ని మరచిపోయి తన పనేదో తాను చేసుకుంటోంది. ఇంతలో సడెన్‌గా ఓ నోటిఫికేషన్ ఆమెను ఆశ్చర్యానికి గురి చేసింది. అది చూసి ఆమె పగలబడి నవ్వుకుంది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. జో బక్‌వెల్ అనే ఓ మహిళ తనకు ఏదైనా జాబ్ ఉంటే ఇవ్వండి అని 2013లో ఓ కంపెనీకి దరఖాస్తు చేసుకుంది. చాలా రోజుల వరకూ రిప్లై రాకపోవడంతో ఇక ఆశలు వదిలేసుకుంది. అయితే సడెన్‌గా 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు సదరు సంస్థ నుంచి.. మీకు ఏ ఉద్యోగమూ ఇవ్వలేము అన్న రిప్లై చూసి జో ఆశ్చర్యపోయింది. తాను అప్లై చేసిన మెసేజ్‌తోపాటు కంపెనీ ఇచ్చిన రిప్లైని కూడా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అది కాస్తా వైరల్‌గా మారింది. వేలాది మంది లైక్ చేయడంతోపాటు సరదా కామెంట్స్ చేస్తున్నారు.