ఆఫ్ఘనిస్తాన్‌కు ఆధీనంలోకి తెచ్చుకుని పాలనపగ్గాలు చేపట్టిన తాలిబాన్‌కు ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ఒక ముఖ్య సూచన చేశారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందాలంటే ముందుగా, అఫ్ఘాన్ ప్రజల ప్రేమను గెలువాలని తాలిబాన్‌కు సూచించారు. ఎన్నికల ద్వారా లేదా లోయ జిర్గా (జాతీయ మహాసభ) నిర్వహించడం ద్వారా జాతీయ చట్టబద్ధత పొందాలని తాలిబాన్‌కు సలహా ఇచ్చారు. ఇదే సమయంలో తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని పాకిస్తాన్ మానుకోవాలన్నారు. వాయిస్ ఆఫ్ అమెరికాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హమీద్ కర్జాయ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు టోలో న్యూస్ వార్తను ప్రచురించింది.
ఇస్లామిక్ ఎమిరేట్ దేశాన్ని నడపడానికి ఒక రాజ్యాంగాన్ని కలిగి ఉండాలని హమీద్ కర్జాయ్ చెప్పాడు. ‘జాతీయ చట్టబద్ధత, అంతర్జాతీయ గుర్తింపు రెండూ ముఖ్యమైనవే. అయితే, జాతీయ మహాసభ ద్వారా జాతీయ చట్టబద్ధతకు మార్గం సుగమం చేయడం లేదా ఆఫ్ఘనిస్తాన్ రాజ్యాంగాన్ని అమలు చేయడం వంటి పనులను ముందు చేపట్టాలి. జాతీయ చట్టబద్ధతను ఎన్నికల ద్వారా లేదా జాతీయ మహాసభ ద్వారా సాధించవచ్చు’ అని కర్జాయ్ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకోవద్దని కర్జాయ్ అన్నారు. పాకిస్తాన్ మాకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు మాట్లాడుతున్నదని, పాక్ తమ ప్రతినిధి కాదని తెల్చిచెప్పారు. వయసు దృష్ట్యా తాను ఆఫ్ఘనిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించలేనని కర్జాయ్ స్పష్టం చేశారు.