అంతర్జాతీయం ముఖ్యాంశాలు

చైనాలో మ‌ళ్లీ క‌రోనా క‌ల‌క‌లం.. ప‌లు న‌గ‌రాల్లో లాక్‌డౌన్‌లు..!

చైనాలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోమారు క‌ల‌క‌లం రేపుతున్న‌ది. గ‌త కొన్ని రోజుల నుంచి వ‌రుస‌గా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వ‌స్తున్న‌ది. దాంతో అక్కడి ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్‌లు విధిస్తున్న‌ది. చైనాలో మూడింట‌ ఒక వంతు అంటే దాదాపు 11 ప్రావిన్స్‌ల‌లో కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. గ‌త‌ వారం రోజుల వ్యవధిలో ఈ 11 ప్రావిన్స్‌ల‌లో 100కు పైగా కేసులు నమోదయ్యాయి. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో చైనా స‌ర్కారు కొవిడ్ నిబంధ‌న‌ల‌ను క‌ఠిన‌త‌రం చేస్తున్న‌ది.

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్న‌ది. ముఖ్యంగా చైనా ఉత్తర ప్రాంతంలోని ప్రావిన్స్‌ల‌లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గాన్సు, ఇన్నర్ మంగోలియా, నింగ్ క్సియా, గుయిజౌ, బీజింగ్ ప్రాంతాల్లో వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న‌ది. దాంతో ఆయా ప్రాంతాల్లో ప‌ర్యాట‌క ప్ర‌దేశాలను అధికారులు మూసివేశారు. మరోవైపు దేశ రాజధాని బీజింగ్‌లో ఇప్పటివరకు 14 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నగరంలోకి వచ్చే వారికి అధికారులు క‌ఠిన‌ నిబంధనలు అమ‌లు చేస్తున్నారు.