(Coup in Sudan) సూడాన్‌లో సైన్యం తిరుగుబాటు చేసింది. సోమవారం రాత్రి ప్రభుత్వం నుంచి అధికారాన్ని సైన్యం లాక్కొన్నది. దీనిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా పౌరులు రోడ్డుపైకి వచ్చి నిరసనలు ప్రారంభించారు. ఈ ప్రదర్శనల్లో ఏడుగురు మరణించగా, 140 మంది గాయపడ్డారు. తిరుగుబాటు నాయకుడు జనరల్ అబ్దల్ ఫట్టా అల్-బుర్హాన్ సైనిక-పౌర పాలక కమిటీని కూడా రద్దు చేశాడు. నియంత ఒమర్ అల్-బషీర్‌ను అధికారం నుంచి తొలగించిన తర్వాత దేశంలో ప్రజాస్వామ్యాన్ని అమలు చేయడానికి రెండేండ్ల క్రితం ఈ కౌన్సిల్ ఏర్పడింది. సూడాన్‌లో సైన్యం తిరుగుబాటు చేయడం పట్ల ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని ప్రకటించింది.
దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటడంతో సైనిక పాలకుడు బుర్హాన్ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. దేశాన్ని రక్షించాల్సింది సైన్యమేనని ప్రజలకు పిలుపునిచ్చారు. 2023 జూలైలో ఎన్నికలు నిర్వహిస్తామని, అప్పుడు ఎన్నికైన ప్రభుత్వానికి అధికారం అప్పగిస్తామని హామీ ఇచ్చారు. దేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యల వల్ల యువత కలలు, దేశ ఆశలకు ముప్పు ఏర్పడిందని బుర్హాన్ విచారం వ్యక్తం చేశారు. ‘దేశంలో ఎమర్జెన్సీ విధించే అధికారం రాజ్యాంగం ప్రధానమంత్రికి మాత్రమే ఇచ్చింది. సైన్యం తీసుకున్న చర్య రాజ్యాంగ విరుద్ధం. హమ్‌దోక్ ఇప్పటికీ చట్టబద్ధంగా దేశానికి అధిపతియే’ అని ప్రధాన మంత్రి అబ్దల్లా హమ్‌దోక్ విధేయుడు సూడాన్ సమాచార మంత్రి ఫేస్‌బుక్ పోస్ట్‌లో రాశారు.
ఇలాఉండగా, సుడాన్‌కు 700 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ సైనిక చర్యను తిరస్కరిస్తున్నామని, గృహనిర్బంధంలో ఉన్న ప్రధానమంత్రి, ఇతర నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని వైట్ హౌస్ ప్రతినిధి కరిన్ జీన్ పియర్ తెలిపారు.