లఖింపూర్ ఖేరి హింసాకాండపై మంగళవారం సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన సాక్షులకు భద్రత కల్పించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హింసాకాండలో జర్నలిస్ట్ రమణ్ కశ్యప్, శ్యామ్ సుందర్ హత్య కేసు దర్యాప్తుపై విచారణ నివేదిక ఇవ్వాలని కోర్టు కోరింది. కేసు తదుపరి విచారణను నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. సుమోటోగా నమోదు చేసిన కేసును సుప్రీంకోర్టు విచారణ జరుపగా.. ఈ సదర్భంగా యూపీ ప్రభుత్వానికి పలు సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పలు పశ్నలు సంధించింది.
ర్యాలీలో నాలుగైదువేల మంది రైతులు ఉంటే.. ప్రత్యక్ష సాక్షులు కేవలం 23 మంది దొరికారా? అని ప్రశ్నించింది. 164 నిబంధన కింద ఎందరు సాక్షుల వాంగ్మూలం నమోదు చేశారు..?, సాక్షుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అని ధర్మాసనం ప్రశ్నించింది. యూపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. 68 మందిని సాక్షులుగా గుర్తించామని, 23 మందే సాక్ష్యం చెప్పేందుకు ముందుకు వచ్చారని కోర్టుకు తెలిపారు.
ధర్మాసనం స్పందిస్తూ ర్యాలీలో వందలాది మంది రైతులు ఉన్నారని, కేవలం 23 మంది సాక్షులు మాత్రమే వచ్చారా? అని కోర్టు ప్రశ్నించగా.. సాల్వే బదులిస్తూ వాగ్మూలం కోసం ప్రకటన జారీ చేశామని, వీడియో ఆధారాలు కూడా దొరికాయని చెప్పారు. విచారణ కొనసాగుతుందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. బలమైన సాక్షులను గుర్తించడం అవసరం, ఎవరైనా సాక్షులు గాయపడ్డారా? అని ప్రశ్నించింది. వీడియోను త్వరగా పరిశీలించాలని, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇవ్వాలని, సాక్షులకు పూర్తి బాధ్యత కల్పించాలని యూపీ ప్రభుత్వానికి చెప్పింది. సాక్షులందరి వాంగ్మూలాలను మేజిస్ట్రేట్ ముందు నమోదు చేయాలని ఆదేశించింది.