గోవాలో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ నెల 30న ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ( Rahul Gandhi ) అక్టోబర్ 30న గోవాకు చేరుకుని కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ.. గోవాలో మైనింగ్ నిషేధం కారణంగా ఉపాధి కోల్పోయిన బాధితులతో భేటీ కానున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని తగిన హామీలను ఇవ్వనున్నారు. అనంతరం అక్కడి మత్స్యకారులను కూడా కలిసి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. గోవాలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లేగాక ఆమ్ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంపై కన్నేశాయి.