పెగాసస్ వ్యవహారంపై నిపుణుల కమిటీ
దేశంలో తీవ్ర దుమారం రేపిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటుచేసింది. పెగాసస్ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ముగ్గురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ నేతృత్వం వహిస్తారని, అలోక్ జోషి, సందీప్ ఒబెరాయ్ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపింది. కమిటీ పనితీరును పర్యవేక్షిస్తామని వెల్లడించింది.
గోప్యత హక్కును కాపాడుకోవడం ముఖ్యమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పెగాసస్ వ్యవహారంలో గోప్యత హక్కు ఉల్లంఘన జరిగిందా లేదా అనేది కమిటీ పరిశీలిస్తుందని తెలిపింది. పౌరులపై నిఘాలో విదేశీ ఏజెన్సీల ప్రమేయంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుందని వ్యాఖ్యానించింది. ఆరోపణలపై క్షుణ్ణంగా పరిశీలించి ఎనిమిది వారాల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. కాగా, కమిటీ ఏర్పాటు చేస్తామన్న కేంద్రం ప్రతిపాదనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. జాతీయ భద్రత పేరుతో బాధ్యతల నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యానించింది.