జాతీయం ముఖ్యాంశాలు

పటాకులపై పూర్తి నిషేధం లేదు

  • బేరియం సాల్ట్‌తో చేసిన వాటిపైనే
  • ప్రజలకు అవగాహన కల్పించండి
  • ఆదేశాల ఉల్లంఘన దురదృష్టకరం
  • అధికారులు కండ్లు మూసుకున్నారా?
  • మళ్లీ ఉల్లంఘన జరిగితే వారిదే బాధ్యత: సుప్రీంకోర్టు

పటాకుల వినియోగంపై తాము సంపూర్ణ నిషేధం విధించలేదని సుప్రీం కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. కేవలం బేరియం సాల్ట్‌తో తయారు చేసిన పటాకులపైనే నిషేధం విధించినట్టు తెలిపింది. ఈ మేరకు తాము గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎవరూ ఉల్లంఘించవద్దని పునరుద్ఘాటించింది. ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం హెచ్చరించింది. వేడుకల కోసం ఇతరుల ప్రాణాలను, ముఖ్యంగా వృద్ధుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని హితవు పలికింది. పటాకుల తయారీ, అమ్మకంపై తాము జారీ చేసిన ఆదేశాలపై విస్తృత ప్రచారం కల్పించి ప్రజల్లో అవగాహన పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

గ్రీన్‌ ముసుగులో నిషేధిత పటాకులు
పటాకుల నిషేధంపై సుప్రీం కోర్టు గతంలోనే సమగ్రమైన ఆదేశాలను జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను అన్ని రాష్ర్టాల్లో యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని సీబీఐ దర్యాప్తులో తేలింది. గ్రీన్‌ క్రాకర్స్‌ ముసుగులో నిషేధిత పటాకులు అమ్ముతున్నారని సుప్రీం కోర్టుకు సీబీఐ నివేదిక సమర్పించింది. ఈ అంశంపై సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘మేం ఇచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదంటే వాటిని అమలు చేయడం అధికారులకు ఇష్టం లేకపోయి ఉండాలి లేదా వారి కండ్లైనా మూసుకుపోయి ఉండాలి’ అని పేర్కొన్నది. ఇది చాలా దురదృష్టకరమని అసహనం వ్యక్తం చేసింది. ఆదేశాల అమలులో ఏమైనా తప్పులు జరిగితే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ‘ఒక రాష్ట్రంలో ఏదైనా ప్రాంతంలో సుప్రీం కోర్టు ఆదేశాల ఉల్లంఘన జరిగితే ఆ రాష్ట్ర చీఫ్‌ సెక్రెటరీ, హోంశాఖ కార్యదర్శి, పోలీస్‌ కమిషనర్‌, డీఎస్పీ, ఉల్లంఘన జరిగిన ప్రాంత పరిధిలోని పోలీస్‌ స్టేషన్‌ ఇంచార్జి బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని స్పష్టం చేసింది.