(Samajwadi Party) అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే కప్ప దుంకుడులు ప్రారంభమవగా.. తాజాగా బీఎస్పీ, బీజేపీ ఎమ్మెల్యేలు సైకిలెక్కారు. బీఎస్పీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఆరుగురు ఎమ్మెల్యేలతోపాటు బీజేపీకి చెందిన ఎమ్మెల్యే కూడా అఖిలేష్ యాదవ్ సమక్షంలో సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఎస్పీలో చేరిన ఎమ్మెల్యేలలో బీఎస్పీ నుంచి సస్పెండైన హరగోవింద్ భార్గవ్, ముజ్తబా సిద్ధిఖీ, హకీమ్ లాల్ బింద్, అస్లాం రైనీ, సుష్మా పటేల్, అస్లాం చౌదరి, బీజేపీ నుంచి సీతాపూర్ ఎమ్మెల్యే రాకేశ్ రాథోడ్ ఉన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం.
గత ఏడాది జరిగిన రాజ్యసభ ఎన్నికల సమయంలో క్రాస్ ఓటింగ్ బయటపడిన తర్వాత ఆరుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి మాయావతి సస్పెండ్ చేశారు. వీరంతా అఖిలేష్ యాదవ్‌ను కలిసి ఎస్పీకి మద్దతు ప్రకటించారు. తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను ఎస్పీలో చేర్చుకోవడంపై మాయావతి మండిపడ్డారు. ఇది అఖిలేష్ ఆడుతున్న “డ్రామా” అని వ్యాఖ్యానించారు. ‘సమాజ్‌వాది పార్టీతోపాటు ఓ పారిశ్రామికవేత్తతో కుమ్మక్కైన వీరంతా తాము నిలిపిన దళిత అభ్యర్థిని రాజ్యసభ ఎన్నికల్లో ఓడించారు. అందుకే వీరిని చాలా కాలం క్రితం బీఎస్పీ నుంచి సస్పెండ్ చేశాం’ అని బీఎస్పీ అధినేత ట్వీట్ చేశారు.