Amit Shah in Lucknow | వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, తిరిగి యోగి ఆదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. 2022లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే మరొక నేతను సీఎంను చేస్తారన్న ప్రచారాన్ని ఆయన కొట్టి పారేశారు. 2024లో మోదీ తిరిగి ప్రధాని కావాలంటే యూపీలో యోగి ఆదిత్యనాథ్‌ను తిరిగి సీఎంను చేయాలన్నారు.
2022లో యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్.. 2024లో ప్రధానిగా మూడోసారి నరేంద్రమోదీ బాధ్యతలు చేపడతారని అమిత్‌షా జోస్యం చెప్పారు. శుక్రవారం ఆయన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అమిత్‌షా మాట్లాడుతూ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలే పునాది కావాలని పిలుపునిచ్చారు.
దీపావళి పర్వదినం తర్వాత రాష్ట్రంలో ఎన్నికల వేడి పుంజుకుంటుందని అమిత్‌షా చెప్పారు. కనుక బీజేపీ కార్యకర్తలు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 300 సీట్లలో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పేర్కొన్నారు. 2017లో బీజేపీ అధికారంలోకి వచ్చాకే.. ఒక్క కుటుంబం కోసం కాక.. ప్రజల కోసం పని చేసే సర్కార్ ఏర్పాటైందన్నారు.