అన్నదాతల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ముందు వరుస పోరాట యోధులతో సమానంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో రైతులు చేసిన కృషి మరచిపోలేనిదన్నారు. రైతుల దృష్టిలో వ్యవసాయం అంటే వృత్తి కాదని, సేద్యాన్నే తమ జీవితంగా భావిస్తారని తెలిపారు. శనివారం విజయవాడలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో జరిగిన ముప్పవరపు ఫౌండేషన్–రైతునేస్తం అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వెంకయ్యనాయుడు.. పలువురు రైతులతో పాటు సేద్యానికి దన్నుగా నిలుస్తున్న శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, పాత్రికేయులకు అవార్డులు బహూకరించారు. 17 ఏండ్లుగా రైతునేస్తం మాసపత్రిక ద్వారా అన్నదాతకు చేదోడుగా నిలుస్తూ ఏటా ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వెంకటేశ్వర రావును ప్రత్యేకంగా అభినందించారు.
వ్యవసాయ రంగంలో శాస్త్రీయ విధానాలను ప్రవేశపెట్టిన ఘనత భారతీయులకే దక్కుతుందని వెంకయ్యనాయుడు చెప్పారు. భారతీయ వాజ్ఞ్మయంలో కృషి విజ్ఞాన ప్రస్తావన ఉందన్నారు. మట్టిలోని సారాన్ని మనుగడకు ఉపయోగపడే ఆహారంగా మార్చే పవిత్ర యజ్ఞమే వ్యవసాయమన్న ఆయన.. పర్యావరణ హిత వ్యవసాయ విధానాలపై రైతుల దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. సేంద్రీయ ఉత్పత్తులకు ప్రస్తుతం మంచి ధర లభిస్తోందని చెప్పారు. వ్యవసాయం అంటే పంటలు పండించడమే కాదు.. పర్యావరణాన్ని కూడా కాపాడుకోవడం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, వైద్య ఆరోగ్యశాఖ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, రైతునేస్తం వ్యవస్థాపకులు యడ్లపల్లి వెంకటేశ్వర రావు, భారతీయ కిసాన్ సంఘ్ దక్షిణ భారత బాధ్యులు కుమార స్వామితోపాటు పలువురు రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పాత్రికేయులు పాల్గొన్నారు.