జాతీయం

జీన్స్ ధ‌రించింద‌ని అమ్మాయిని గెంటేశారు..

ఓ ముస్లిం యువ‌తికి తీవ్ర అవ‌మానం ఎదురైంది. ఆ అమ్మాయి జీన్స్ ధ‌రించింద‌ని దారుణంగా కొట్టారు. అంతే కాదు ఎందుకు బుర్ఖా ధ‌రించ‌లేద‌ని దుర్భ‌ష‌లాడారు. ఈ అమానుష ఘ‌ట‌న అసోంలోని బిశ్వ‌నాథ్ జిల్లాలో గ‌త వారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. బిశ్వ‌నాథ్ జిల్లాకు చెందిన ఓ ముస్లిం అమ్మాయి.. ఇయ‌ర్ ఫోన్స్ కొనేందుకు ఓ మొబైల్ దుకాణానికి వెళ్లింది. ఆ షాపు ఓన‌ర్ నూరుల్ అమీన్ ఆ యువ‌తి ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించాడు. బుర్ఖా స్థానంలో జీన్స్ ధ‌రించినందుకు ఆమెను ప‌రుష ప‌ద‌జాలంతో దూషించాడు. షాపు నుంచి గెంటేసి కొట్టారు.

ఈ సంద‌ర్భంగా బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. త‌న బిడ్డ‌ను షాపు య‌జ‌మాని తీవ్రంగా హింసించార‌ని పేర్కొన్నాడు. అసోంలో తాలిబ‌న్ సిస్ట‌మ్‌ను తీసుకువ‌స్తున్నార‌ని మండిప‌డ్డాడు. బుర్ఖా ధ‌రించాల‌ని ఒత్తిడి తేవ‌డం సరికాద‌న్నాడు. అసామీ క‌ల్చ‌ర్‌ను ఫాలో అవుతే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నించాడు. బాధితురాలు ప్ర‌స్తుతం బ్యాచిల‌ర్ ఆఫ్ కంప్యూట‌ర్ అప్లికేష‌న్ చ‌దువుతోంది. ఈ ఘ‌ట‌న‌పై బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.