కర్ణాటక ఉప ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బొమ్మై సొంత జిల్లా హవేరీలోని హంగల్ నియోజకవర్గంలో అధికార బీజేపీ ఓటమి పాలైంది. హంగల్‌లో బీజేపీ అభ్యర్థి శివరాజ సజ్జనార్‌ను కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ మానె 7,598 ఓట్ల తేడాతో ఓడించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అధికార పార్టీ అభ్యర్థి ఇంత ఘోరంగా ఓడిపోవడం బసవరాజ్ బొమ్మైకి గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. బసవరాజ్ బొమ్మై ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 100 రోజుల తర్వాత ఈ ఉప ఎన్నికలు జరిగాయి.
అయితే, కర్ణాటకలో ఉప ఎన్నికలు జరిగిన మరో నియోజకవర్గం సిండ్‌గీలో బీజేపీ అభ్యర్థి రమేశ్ భూసనూర్ 31,185 ఓట్ల తేడాతో భారీ విజయం సాధించారు. రమేశ్ భూసనూర్‌కు 93,865 ఓట్లు రాగా.. ఆయన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ మనగులికి 62,680 ఓట్లు వచ్చాయి. రాష్ట్రంలోని ఒక నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిచిన బీజేపీ.. సీఎం సొంత జిల్లాలోని నియోజవర్గంలో పరాజయం పాలు కావడం సీఎం బొమ్మై ఇమేజ్‌ను డ్యామేజ్ చేసిందనే చెప్పవచ్చు.