(Bobbili) బొబ్బిలిలో చక్కెర రైతులు ఆందోళనా బాట పట్టారు. షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యవైఖరి కారణంగా రైతుల ఆందోళన ఉద్రిక్త స్థాయికి చేరుకున్నది. బకాయిలు చెల్లించాలంటూ రైతులు ఆందోళనకు దిగి రాయగడ హైవేపై బైఠాయించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నది.
గత కొన్నాళ్లుగా బకాయిలు చెల్లించకుండా బొబ్బిలి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం వేధిస్తున్నదంటూ బుధవారం మధ్యాహ్నం రైతులు పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. రైతులకు వెంటనే రూ.17 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ రైతులు డిమాండ్ చేశారు. రైతులు రాయగడ హైవేపై బైఠాయించడంతో పోలీసులు వారిని సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అయినా రైతులు వినిపించుకోలేదు. తక్షణమే బకాయిలు చెల్లించాలని పట్టుబట్టడంతో రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది. హైవేపై బైఠాయించిన రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా, రైతులు రాళ్లు, కొబ్బరి బొండాలతో పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్‌ఐతోపాటు మహిళా కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానిక దవాఖానకు తరలించారు.