(MP Suresh) బద్వేల్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధ ఘన విజయం సాధించి ఒక్క బీజేపీనే కాకుండా.. అటు టీడీపీని, ఇటు జనసేనను కూడా ఘోరంగా ఓడించారని ఎంపీ నందిగం సురేశ్ చెప్పారు. ఓటమి తప్పదన్న భయంతోనే ఆ రెండు పార్టీలు ఎన్నికల బరిలోకి రాలేదని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ అభ్యర్థికి ఈ రెండు పార్టీలు బయటి నుంచి మద్దతు ఇచ్చినప్పటికీ ప్రజలు వైసీపీకే పట్టం కట్టారని, ఇది జగన్ ప్రజాపానలకు నిదర్శనమన్నారు. ముఖ్యంగా చంద్రబాబు తెర వెనుక ఉంటూ బీజేపీకి 20వేల ఓట్లు వేయించారని ఆరోపించారు. బద్వేల్ ఉప ఎన్నిక ఫలితం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫలితాలను విశ్లేషిస్తూ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలపై విమర్శలు గుప్పించారు.
‘వైసీపీని చూస్తే చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతున్నది. అందుకే కుప్పంలో ఉండమంటారా? వద్దా? అని తన నియోజకవర్గ ప్రజలను అడిగే స్థాయికి చేరుకున్నారు. జగన్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే కొందరు రైతులను రెచ్చగొట్టి పాదయాత్ర ద్వారా తిరుపతి తీసుకెళ్తున్నారు. చంద్రబాబు, ఆయన బినామీలు మాత్రమే అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ పాదయాత్రలో ఏదైనా అనుకోనిది జరిగితే దానికి చంద్రబాబే బాధ్యత వహించాలి’ అని ఎంపీ సురేశ్ వ్యాఖ్యానించారు. బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థిపై 90, 533 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.