జాతీయం ముఖ్యాంశాలు

Mumbai High Alert | ముకేశ్ అంబానీ ఇంటికి అనుమానాస్పద ఫోన్ కాల్స్.. ముంబైలో హై అలర్ట్‌

Mumbai High Alert | ముంబైలో పోలీసులు హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. రిల‌య‌న్స్ అధినేత ముకేశ్ అంబానీ నివాసానికి అనుమానాస్ప‌ద ఫోన్ కాల్స్ రావ‌డంతో ముంబై పోలీసులు అప్ర‌మ‌త్తం అయ్యారు. ఆయ‌న నివాసానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న భ‌ద్ర‌తను క‌ట్టుదిట్టం చేశారు. ముంబైలోని ముకేశ్ అంబానీ నివాసం అంటిల్లాకు సోమ‌వారంఅనుమానాస్పద ఫోన్ కాల్ వ‌చ్చింది. దీంతో పోలీసులు అప్ర‌మ‌త్తం అయ్యారు. ఆ ఫోన్ కాల్ చేసింది ఒక ట్యాక్సీ డ్రైవ‌ర్ అని తేలింది. ఇద్ద‌రు వ్య‌క్తులు ముకేశ్ అంబానీ ఇంటికి బ్యాగ్ తీసుకెళ్లాల‌ని కోరార‌ని ఆ ట్యాక్సీ డైవ‌ర్ చెప్పాడ‌ని పోలీసులు తెలిపారు.

ట్యాక్సీ డ్రైవ‌ర్ ఫొన్ కాల్‌పై పోలీసులు ఇలా

మేం ఓ ట్యాక్సీ డ్రైవ‌ర్ నుంచి ఫోన్ కాల్ అందుకున్నాం. ఇద్ద‌రు వ్య‌క్తులు ముకేశ్ అంబానీ ఇల్లు అంటిల్లాకు బ్యాగ్ తీసుకెళ్లాల‌ని కోరారని ఆ డ్రైవ‌ర్ మా ద‌ర్యాప్తులో చెప్పాడు అని ముంబై పోలీసులు చెప్పారు. ప్ర‌స్తుతం అంబానీ ఇంటి వ‌ద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌ల‌ను పోలీసులు స‌మీక్షిస్తున్నారు. డీసీపీ స్థాయి అధికారి ప్ర‌స్తుతం అంబానీ ఇంటి వ‌ద్ద ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

ఫిబ్ర‌వ‌రిలో అంబానీ నివాసానికి భారీ ముప్పు

ఇంత‌కుముందు ఫిబ్ర‌వ‌రిలో ముకేశ్ అంబానీ నివాసానికి భారీ భ‌ద్ర‌త ముప్పు ఏర్ప‌డింది. ఆయ‌న నివాసానికి కొద్ది దూరంలో పేలుడు ప‌దార్థాల‌తో నింపిన స్కార్పియో దొరికింది. ఆ వాహ‌నంలో 20 జిలెటిన్ స్టిక్స్ దొరికాయి. అంతే కాదు.. ముకేశ్‌.. ఆయ‌న స‌తీమ‌ణి నీతా అంబానీల‌కు రాసిన లేఖ కూడా దొరికింది. కానీ అందులో వివ‌రాలు వెల్ల‌డి కాలేదు. స‌ద‌రు కారును ఎవ‌రో దొంగిలించార‌ని తేలింది. అటుపై కొన్ని రోజుల‌కు స‌ద‌రు కారు య‌జ‌మాని హ‌త్య‌కు గుర‌య్యారు. దీంతో నాటి నుంచి ముకేశ్ అంబానీ అంటిల్లా వ‌ద్ద భ‌ద్ర‌త ప‌టిష్టం చేశారు.

పోలీసు అధికారికి కేసుతో లింక్‌పై ద‌ర్యాప్తు

ఈ కేసు ద‌ర్యాప్తును జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) టేకోవ‌ర్ చేసింది. బ‌య‌ట‌ప‌డ‌ని ఈ కుట్ర‌కు, ఒక పోలీస్ అధికారికి లింక్‌లు ఉన్నాయ‌ని సందేహాలు ఉన్నాయి. కారు య‌జ‌మాని మాన్‌సుఖ్ హైరెన్ హ‌త్య త‌ర్వాత‌.. ఆయ‌న‌తో లింక్‌లు ఉన్న పోలీసు అధికారి స‌చిన్ వాజె ఇప్ప‌టికీ స‌స్పెన్ష‌న్‌లోనే ఉన్నారు. ముకేశ్ అంబానీ నివాసం వ‌ద్ద పార్క్ చేసిన ఈ కారులో పేలుడు ప‌దార్థాల‌ను స‌చిన్ వాజె బ‌య‌ట‌కు తీయ‌డం గ‌మ‌నార్హం.